కొత్త సీజన్ కోసం ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ఎంపిక చేసింది. దాంతో కెప్టెన్సీ మార్పు నిర్ణయం క్రికెట్‌లో పెను తుఫాను సృష్టించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌పై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లను కూడా కోల్పోయింది. అయితే తాజాగా ఈ విషయంపై ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు. ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఓ క్రికెటింగ్ నిర్ణయం.
వోద్వేగాలకు కట్టుబడి తమ నిర్ణయాన్ని మార్చుకోలేము. ఇది పూర్తిగా ఆటకు సంబంధించిన అంశం. ప్రస్తుత జట్టులో పరివర్తనం చేయలనుకున్నాం. అందుకే రోహిత్ స్థానంలో హార్దిక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నాం. కానీ కొందరూ అభిమానులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నారు. తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు. కానీ ఆటలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. గత రెండు సిజన్లలో రోహిత్ శర్మ స్వేచ్చగా ఆడలేక పోతున్నాడు.
కెప్టెన్సీ అనేది చాలా ఒత్తిడితో కూడిన బాధ్యత. ఒత్తిడిలో అతనూ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేక పోతున్నాడు. అందుకే రోహిత్ పనిభారం తగ్గించాలనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నామని కోచ్ బౌచర్ వివరించాడు. అలాగే టోర్నీకి ముందు ఫోటో షూట్స్, ప్రకటనలు వంటివి చాలా బాధ్యతలు ఉంటాయి. వాటి అన్నింటి నుంచి రోహిత్‌కు కాస్తా ఉపశమనం లభిస్తుందని భావించి హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించామని బౌచర్ పేర్కొన్నాడు. కాగా.. ఈ విషయంపై రోహిత్ శర్మ సతీమణి రితికా స్పదించింది. ఇందులో చాలా వరకు తప్పిదాలే ఉన్నాయని ఆమె కామెంట్ చేయడంతో ఈ విషయం మరోసారి చర్చకు దారితీసింది.