ఐపీఎల్-2024 హోరాహోరీగా సాగుతోంది. 17వ సీజన్ ప్రారంభమై పది రోజలే దాటింది. అయినప్పటికీ ఈ కొద్ది రోజుల్లోనే క్రేజీ రికార్డులు, అదిరే సిక్సర్లు, వికెట్ల మోత, కళ్లుచెదిరే క్యాచ్‌లు నమోదయ్యాయి. అయితే సాఫీగా సాగుతున్న ఈ సీజన్ మధ్యలో బ్రేక్ పడే అవకాశం ఉంది. ఓ ఐపీఎల్ మ్యాచ్‌ను వాయిదా వేయాలని బీసీసీఐ భావిస్తున్నది.
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 17వ తేదీన జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో ఈ నిర్ణయం తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే శ్రీరామనవమి ఉత్సవాలు, మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రతా పరమైన సమస్యలను అధిగమించడానికి మ్యాచ్‌ను వాయిదా వేయాలని చూస్తోంది.
ఇప్పటికే రీషెడ్యూల్‌కు సిద్ధంగా ఉండాలని కేకేఆర్, రాజస్థాన్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కబురు పంపినట్లు సమాచారం. అలాగే మ్యాచ్ వాయిదా పడే అవకాశం గురించి బ్రాడ్‌కాస్టర్స్‌కు కూడా సమాచారాన్ని చేరవేసింది. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, బీసీసీఐ పెద్దలు క్రికెట్ అసోషియేష్ ఆఫ్ బెంగాల్, కోల్‌కతా పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. కాగా, బెంగాల్ పోలీసులు మ్యాచ్ భద్రతపై గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేకేఆర్-పోరు షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది.