థైలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీలు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప-తనిషా క్రాస్టోలు సెమీస్‌లో ప్రవేశించాయి. మరోవైపు సింగిల్స్‌లో అద్భుత ప్రదర్శనలు చేసిన మీరబా లువాంగ్ మైసనాం పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సాత్విక్-చిరాగ్ ద్వయం 21-7, 21-14 తేడాతో మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్-రాయ్ కింగ్ యాప్ జంటను వరుస గేముల్లో చిత్తు చేశారు.
ఆది నుంచే దూకుడుగా ఆడిన భారత స్టార్ జంట థైయ్ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. వరుస స్మాష్‌లతో వారిపై విరుచుకపడి తొలి గేమ్‌ను 21-7 భారీ తేడాతో గెలుచుకున్నారు. తర్వాత రెండో సెట్‌లో మాత్రం జునైదీ ద్వయం కాస్తా పోటీనిచ్చింది. కానీ చివర్లో జోరు పెంచిన టాప్ సీడ్ సాత్విక్ జోడీ భారీ ర్యాలీలతో ఈ గేమ్‌ను 21-14తో గెలిచి దర్జాగా సెమీస్‌లోకి దూసుకెళ్లారు. ఈ మ్యాచ్‌ను వీరు 38 నిమిషాల్లోనే ముగించేశారు.
మహిళల డబుల్స్ లోనూ భారత అమ్మాయిలు జోరు ప్రదర్శించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో జంట 21-15, 21-23, 21-19 తేడాతో ఆరో సీడ్ లీ యు లీమ్-షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) జోడీపై పోరాడి గెలిచారు. తొలి గేమ్‌ను ఈజీగా గెలుచుకున్న వీరికి రెండో గేమ్‌లో మాత్రం షాక్ తగిలింది. తర్వాత జరిగిన నిర్ణయాత్మకమైన ఆఖరి గేమ్‌లో మాత్రం భారత జోడీ ఒత్తిడిలోనూ అద్భుతంగా పోరాడి 21-19తో ఈ గేమ్‌తో పాటు మ్యాచ్ కూడా సొంతం చేసుకుని టోర్నీలో ముందంజ వేసింది.
సింగిల్స్‌లో మీరబా ఓటమి..
ఈ టోర్నీలో సంచలన విజయాలతో అందరి దృష్టి ఆకర్షించిన మీరబా లువాంగ్ ఆఖరికి క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో 21 ఏళ్ల మీరబా 12-21, 5-21 తేడాతో వరల్డ్ చాంపియన్ కున్లవత్ వితీసర్న్ (థైలాండ్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అంతకుముందు మీరబా తొలి రౌండ్‌లోనే భారత స్టార్ హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. తర్వాత ప్రీ క్వార్టర్స్‌లో డెన్మార్క్ షట్లర్ మాడ్స్ క్రిస్టోఫర్సన్‌పై విజయం సాధించాడు. కానీ ఆ తర్వాత జరిగిన క్వార్టర్ పోరులో మాత్రం ఈ యువ షట్లర్‌కు పరాభవం తప్పలేదు.