సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న కర్ణాటక యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సంతోషం వ్యక్తం చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం తన కలని, అది నెరవేరే సమయం ఆసన్నమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
టీమిండియా పిలుపు అందుకోవడంపై స్పందించిన దేవదత్ పడిక్కల్ నమ్మలేకపోతున్నానని తెలిపాడు. ‘టెస్ట్ జట్టులోకి పిలుపు అందుకోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. భారత జట్టు తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడటం నా కల. కెరీర్‌లోనే చాలా కఠినమైన కాలం గడిచాక ఈ అవకాశం వచ్చింది. నా కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా అనారోగ్యం నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధించడం నా జీవితంలో నాకు ఎదురైన అతిపెద్ద సవాల్. ఈ క్రమంలో నేను ఏకంగా 10 కిలోల బరువు తగ్గాను. ఆ సమయంలో సరైన ఆహారం, కండరాలను బలోపేతం చేసుకోవడంపై మాత్రమే ఫోకస్ పెట్టాను. ‘అని పడిక్కల్ చెప్పుకొచ్చాడు.