ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ టోర్నీలో ఐదో సీడ్ జెస్సికా పెగులా, ఏడో సీడ్ హుబర్ట్ హర్కాజ్లకు ఊహించని షాక్ తగిలింది. మరోవైపు సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, డిమిత్రోవ్, ఒన్స్ జబీరీ, ఒస్టాపెంకో తదితరులు మూడో రౌండ్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) 6-3, 6-4, 5-7, 7-5 తేడాతో స్థానిక ఆటగాడు జాకబ్ ఫీయర్న్లే (యూకే)పై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశాడు.
మరో మ్యాచ్‌లో 10వ సీడ్ గ్రీగర్ డిమిత్రోవ్ (బల్గెరియా) 5-7, 6-7(4-7), 6-4, 6-2, 6-4 తేడాతో షాంగ్ జన్చెంగ్ (చైనా)పై చెమటోడ్చి నెగ్గాడు. 9వ సీడ్ అలెక్స్ డి మీనౌర్ (ఆస్ట్రేలియా) 6-2, 6-2, 7-5 తేడాతో జౌమె మునార్ (స్పెయిన్)ను చిత్తుగా ఓడించాడు. మరోవైపు పోలాండ్ స్టార్ 7వ సీడ్ హుబర్ట్ హర్కాజ్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు.
పెగులాకు వాంగ్ షాక్..
అమెరికా స్టార్ ప్లేయర్ ఐదో సీడ్ జెస్సికా పెగులాకు చైనా క్రీడాకారిణి వాంగ్ జిన్యూ భారీ షాకిచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో వాంగ్ 6-4, 6-7 (7-9), 6-1 తేడాతో పెగులాపై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో పదో సీడ్ ఒన్స్ జబీర్ (టునిషియా)6-1, 7-5 తేడాతో రాబిన్ మొంట్గొమేరీ (అమెరికా)పై గెలిచి టోర్నీలో ముందంజ వేసింది. 13వ సీడ్ జెలినా ఒస్టాపెంకో (లాట్వియా) 6-3, 6-0 తేడాతో ఉక్రేయిన్‌కు చెందిన డారియా స్నీగర్ను వరుస సెట్లలో చిత్తుగా ఓడించింది. ఇంకో మ్యాచ్‌లో మాడిసన్ కీస్ (అమెరికా) 6-2, 6-2 తేడాతో వాంగ్ యఫాన్ (చైనా)పై నెగ్గింది.