Saturday, September 14, 2024

Tennis – యుఎస్ ఓపెన్ లో జ‌కోవిచ్ అవుట్

మూడో రౌండ్ లోనే ఇంటి దారి
ఇప్ప‌టికే అల్క‌రాజ్ ఓట‌మి

యూఎస్‌ ఓపెన్‌ 2024లో మరో సంచలనం నమోదైంది. టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌ ఇంటిదారి పట్టాడు.
మూడో రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్‌ అలెక్సీ పాప్రియన్‌ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో రెండో సీడ్‌ జకోవిచ్‌ ఓటమి పాలయ్యాడు. 18 ఏళ్లలో యూఎస్‌ ఓపెన్‌ నాలుగో రౌండ్‌కు చేరకుండానే జకో నిష్క్రమించడం గమనార్హం. ఆర్థర్ యాష్ స్టేడియంలో ఇద్దరి మధ్య 3 గంటల 19 నిమిషాల పాటు హోరాహోరీ పోరు సాగింది.

అలెక్సీ పాప్రియన్‌ ముందు నోవాక్ జకోవిచ్‌ పూర్తిగా తేలిపోయాడు. తొలి రెండు సెట్లను కోల్పోయిన జకో మూడో సెట్‌ను కైవసం చేసుకొని రేసులోకి వచ్చాడు. ఈ సమయంలో పుంజుకున్న పాప్రియన్.. జకోవిచ్‌ జోరుకు అడ్డుకట్ట వేశాడు. నాలుగో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుని తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లాడు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ సాధించాలని చూసిన జకోకు నిరాశే ఎదురైంది.

- Advertisement -

ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్‌ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌కు చెందిన 74వ ర్యాంకర్ బొటిక్ వాన్‌ డి జాండ్‌స్కల్ప్‌ చేతిలో ఓడిపోయాడు. బొటిక్‌ 6-1, 6-5, 6-4 తేడాతో వరుస సెట్లలో అల్‌కరాజ్‌పై విజయం సాధించాడు. అల్‌కరాజ్‌, జకోవిచ్‌ ఇంటిదారి పట్టడంతో యూఎస్‌ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్లు అవతరించేలా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement