గ్రాస్‌కోర్టు గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో అగ్రశ్రేణి ప్లేయర్లు కార్లోస్ అల్కరాజ్, కోకో గాఫ్, ఫ్రాన్సెస్ టియాఫే మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో అమెరికా యువ సంచలనం రెండో సీడ్ కోకో గాఫ్ 6-2, 6-1 తేడాతో రొమేనియాకు చెందిన క్వాలిఫయర్ అన్కా టొడోనిను వరుస సెట్లలో చిత్తు చేసి టోర్నీలో ముందంజ వేసింది. మహిళల సింగిల్స్ మరో మ్యాచ్‌లో స్థానికి ప్లేయర్ సొనయ్ కార్టల్ (యూకే) 6-3, 5-7, 6-3 తేడాతో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై విజయం సాధించిం మూడో రౌండ్లో అడుగుపెట్టింది.
కార్లోస్, ఫ్రాన్సిస్ అలవోకగా..
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ 7-6, 6-2, 6-2 తేడాతో అలెగ్జాండర్ వుకీక్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా విజయం సాధించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో అమెరికా స్టార్ ఫ్రాన్సిస్ టియాఫే 7-6 (7-5), 6-1, 6-3 తేడాతో క్రొయేషియాకు చెందిన బొర్నా కొరిక్పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో బ్రాండన్ నికాశిమా (అమెరికా) 6-3, 6-2, 6-2 తేడాతో జోర్డన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో ఓడించి టోర్నీలో ముందంజ వేశాడు.
నగాల్ జోడీ పరాజయం..
ఇప్పటికే సింగిల్స్ తొలి రౌండ్లోనే నిష్క్రమించిన భారత నెం.1 నగాల్‌కు.. డబుల్స్‌లోనూ భారీ షాక్ తగిలింది. ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో సుమిత్ నగాల్ (భారత్)- డుసన్ లజోవిక్ (సెర్బియా) జోడీ 2-6, 2-6 తేడాతో స్పెయిన్‌కు చెందిన పెడ్రో మార్టినేజ్-జౌమె మునార్ జంట చేతిలో పరాజయం పాలైంది.