Wednesday, November 20, 2024

Spl Story: ఇవ్వాల సఫారీలతో టీమిండియా బిగ్ ఫైట్.. హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి భారత జట్టు

టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న భారత జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇప్పటికే పాక్‌, నెదర్లాండ్స్‌పై భారీ గెలుపులను నమోదు చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీ ఫైనల్‌కు వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే సఫారీలతో టీమిండియా టీ20లతోపాటు, వన్డేలు ఆడి మాంచి జోష్మీద ఉంది. ఇవ్వాల గెలిస్తే ఇక నేరుగా సెమీస్కు చేరుకోవడం ఖాయం అయినట్టే..

– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ

ఇప్పటి వరకు భారత్‌ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ 20 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇందులో భారత్‌ పైచేయి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 23 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో భారత్‌ 13 మ్యాచ్‌లు గెలిచింది. కాగా, 9 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. అదే సమయంలో ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దక్షిణాఫ్రికా జట్టు ఇటీవల భారత్‌లో పర్యటించింది. ఈ సందర్బంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ జరిగింది. ఇందులో భారత్‌ 2-1తో విజయం సాధించింది. ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లను పరిశీలిస్తే రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్‌ 16 మ్యాచుల్లో 405 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలు చేశాడు. విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 12 మ్యాచుల్లో 306 పరుగులు చేశాడు. దినేష్‌ కార్తిక్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. 12 మ్యాచ్‌లు ఆడి 215 పరుగులు చేశాడు.

ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి గ్రూప్‌ 2లో అగ్రస్థానం చేసుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. టీ 20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న భారత్‌ ఆదివారం జరిగే ముఖ్యమైన మ్యాచ్‌కు సిద్దమైంది. పాకిస్థాన్‌, నెదర్లాండ్‌ జట్లపై ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో అద్భుత విజయాలు నమోదు చేసుకున్న భారత్‌ దక్షిణాఫ్రికాపైనా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గ్రూప్‌ 2లో సెమీస్‌కు చేరే జట్టును ఈ మ్యాచ్‌ ఫలితం నిర్ణయించనుండటం వల్ల భారత్‌ , దక్షిణాఫ్రికా జట్టుకు ఈ పోరు ఎంతో కీలకంగా మారింది. ఇరు జట్ల మధ్య హోరా హోరీగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే రెండు విజయాలతో గ్రూప్‌ -2లో భారత్‌ టాప్‌1లో ఉండగా దక్షిణాఫ్రికా ఒక విజయం, మరో డ్రాతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -

భారత్‌, దక్షిణాఫ్రికా బలాలను చూస్తే భారత జట్టు ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఫామ్‌లేమితో
బాధ పెడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నెదర్లాండ్స్‌ పై అర్థ శతకంతో రాణించడం భారత జట్టుకు కలిసి రానుంది. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం కీలక మ్యాచ్‌లో రాణిస్తే భారత్‌కు తిరుగుండదని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఇక మిడిలార్డర్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా ఉంది.

ఇక ఆల్‌ రౌండర్ల విభాగంలో హార్థిక్‌ పాండ్యా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తుండగా, అక్సర్‌ పటేల్‌ అదే రీతిలో జట్టుకు ఉపయోగపడాలని భారత జట్టు భావిస్తోంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే భారత్‌ చాలా బలంగా కనిపిస్తోంది. స్వింగ్‌ కింగ్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మునుపటి ఫామ్‌ను అందుకోవడం మరో సానుకూలాంశంగా మారింది. ఇంకా మహమ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ రాణిస్తుండటం జట్టుకు కలిసి వచ్చే అంశం కానుంది. దక్షిణాఫ్రికా కూడా అన్ని రంగాల్లో భారత జట్టుకు సమ ఉజ్జీగా కనిపిస్తోంది. జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా డ్రా ముగించుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏకంగా 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అదే ఉత్సాహంతో టీమిండియాను ఓడించి గ్రూప్‌ 2 పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరాలని సఫారీ జట్టు భావిస్తోంది.

భారత జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్థిక్‌ పాండ్యా, దినేష్‌ కార్తిక్‌, (కీపర్‌), అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, రిషబ్‌ పంత్‌, యుజ్వేంద్ర చాహల్‌, దీపక్‌ హుడా

Advertisement

తాజా వార్తలు

Advertisement