ఢిల్లీలో భారీగా స్వాగతానికి ఏర్పాట్లు
టీమ్ ను సత్కరించనున్న ప్రధాని మోదీ..
టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియా గురువారం ఉదయం భారత్ చేరుకునే అవకాశముంది. వాస్తవానికి ప్రపంచకప్ ముగిసిన వెంటనే గత సోమవారమే టీమిండియా స్వదేశానికి రావాల్సి ఉంది. కానీ భారీ తుఫాను కారణంగా రాకపోకలు స్థంభించడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ జరిగిన బార్బడోస్‌తో పాటు సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రైనడైన దీవులపై బెరిల్ హరికేన్ పంజా విసిరింది. దాంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అక్కడి అధికారులు ఆదేశించారు. బెరిల్ హరికేన్ కారణంగా గత నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలోని విమాన రాకపోకలు పూర్తిగా స్థంభించాయి.
బార్బడోస్ విమానాశ్రాయాన్ని మూడు రోజుల పాటు తాత్కలికంగా మూసివేశారు. మంగళవారమే రీఓపెన్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల భారత ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్‌కే పరిమితమయ్యారు. గత మూడు రోజులుగా బార్బోడస్‌లో కర్ఫ్యూ కొనసాగింది. ఈ తుఫాను కారణంగా భారత ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
హోటల్‌లోని సిబ్బంది కొరత కారణంగా భారత ఆటగాళ్లు క్యూలైన్‌లో నిల్చొని పేపర్ ప్లేట్లలో భోజనం చేసినట్లు ప్రపంచకప్ కోసం వెళ్లిన భారత మీడియా ప్రతినిధులు తెలిపారు. మంగళవారం నుంచి తుఫాను ప్రభావం తగ్గడంతో భారత ఆటగాళ్లను రప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం పంపించింది. ఈ విమానం బుధవారం సాయంత్రానికల్లా ప్రపంచకప్ ఫైనల్ జరిగిన బార్బోడస్ విమానాశ్రాయనికి చేరుకోనుంది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన టీమిండియా.. గురువారం ఉదయం 1.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించనున్నారు.