Saturday, November 23, 2024

ఫైనల్ మ్యాచ్‌ గెలిచినా, ఓడినా ఈ క్రికెట్‌ ఇక్కడితో ఆగ‌దు: విరాట్ కోహ్లీ..

డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఓ సాధారణ మ్యాచ్ వంటిదేన‌ని చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాము కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నామ‌ని, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా దానినే ఇకపై కొనసాగిస్తామ‌ని విరాట్ కోహ్లీ చెప్పాడు. తాము 2011 ప్రపంచకప్‌ గెలిచామ‌ని,  గెలుపోటములను ఒకేలా తీసుకోవాలని తెలిపాడు. చరిత్రను పరిశీలిస్తే ఎందరో ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారని, టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్‌ గెలిచినా, ఓడినా, ఈ క్రికెట్‌ ఇక్కడితో ఆగిపోదని విరాట్ కోహ్లీ తెలిపాడు. అందుకే ఈ మ్యాచ్‌ను మరీ ప్రత్యేకంగా ఏమీ చూడటం లేదని చెప్పాడు. ఈ మ్యాచ్ కోసం బయటవాళ్లు మాత్రమే ఆత్రుత పడుతూ, చావోరేవో అన్నట్టు భావిస్తారని చెప్పుకొచ్చాడు.  

త‌మ జ‌ట్టు కుర్రాళ్లు ఎంతో అనుభవం ఉన్న ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడించారని విరాట్ కోహ్లీ గుర్తు చేశాడు. ఈ ఫైనల్‌ చేరుకొనేందుకు తామెంత కష్టపడ్డామో అందరికీ తెలుసని తెలిపాడు. కాగా, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పద్ధతిని మధ్యలో మార్చడం సరికాదని చెప్పాడు. క‌రోనా వేళ‌ ఆటగాళ్లంతా ఇళ్లలో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏంట‌ని నిల‌దీశాడు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement