డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఓ సాధారణ మ్యాచ్ వంటిదేనని చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాము కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నామని, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా దానినే ఇకపై కొనసాగిస్తామని విరాట్ కోహ్లీ చెప్పాడు. తాము 2011 ప్రపంచకప్ గెలిచామని, గెలుపోటములను ఒకేలా తీసుకోవాలని తెలిపాడు. చరిత్రను పరిశీలిస్తే ఎందరో ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారని, టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచినా, ఓడినా, ఈ క్రికెట్ ఇక్కడితో ఆగిపోదని విరాట్ కోహ్లీ తెలిపాడు. అందుకే ఈ మ్యాచ్ను మరీ ప్రత్యేకంగా ఏమీ చూడటం లేదని చెప్పాడు. ఈ మ్యాచ్ కోసం బయటవాళ్లు మాత్రమే ఆత్రుత పడుతూ, చావోరేవో అన్నట్టు భావిస్తారని చెప్పుకొచ్చాడు.
తమ జట్టు కుర్రాళ్లు ఎంతో అనుభవం ఉన్న ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడించారని విరాట్ కోహ్లీ గుర్తు చేశాడు. ఈ ఫైనల్ చేరుకొనేందుకు తామెంత కష్టపడ్డామో అందరికీ తెలుసని తెలిపాడు. కాగా, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పద్ధతిని మధ్యలో మార్చడం సరికాదని చెప్పాడు. కరోనా వేళ ఆటగాళ్లంతా ఇళ్లలో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని నిలదీశాడు.