ఇంగ్లండ్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో పాల్గొనే ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారెంటైన్‌లో ఉన్నది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు ఏడు రోజుల క్వారెంటైన్ ఆంక్షలను పాటిస్తున్నారు. ప్రత్యేకంగా వేరువేరు రూముల్లో ఉంటున్న ఆ క్రికెటర్ల కోసం ఏర్పాట్లు కూడా చేశారు. జూన్ రెండవ తేదీన ముంబై నుంచి కోహ్లీ టీమ్ ఇంగ్లండ్‌కు వెళ్తుంది. అయితే కొందరు ముంబై ప్లేయర్ల ముందు నుంచే క్వారెంటై న్‌లో ఉన్నారు. సోమవారం నుంచి ఆ బయోబబుల్‌లోకి కోహ్లీతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు తోడయ్యారు. ప్రస్తుతం టూర్ వెళ్లే అందరూ ప్రత్యేక రూముల్లోనే క్వారెంటైన్‌లో ఉన్నారు.
ఇక వారి ఫిటనెస్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి రూమ్‌లోనూ వర్కౌట్ ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్‌లోనూ సైకిళ్లు, డంబుల్స్, బార్లను ఫిక్స్ చేశారు. శారీరకంగా దృఢంగా ఉండేందుకు.. శిక్షణ కోసం ఆ ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. క్వారెంటైన్‌లో ఉన్న క్రికెటర్లకు ప్రతి రోజు కోవిడ్ పరీక్షలు చేయనున్నారు. ఎటువంటి అలసత్వం ప్రదర్శించడం లేదని బీసీసీఐ చెప్పింది. ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత కూడా భారత క్రికెటర్లు పది రోజుల పాటు కఠిన క్వారెంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాతే వాళ్లు మైదానంలోకి దిగుతారని బీసీసీఐ అధికారులు చెప్పారు. ఇంగ్లండ్‌తో సిరీస్ సమయంలో కోహ్లీ సేన అక్కడే కోవిడ్ టీకా రెండో డోసు తీసుకోనున్నది.