Friday, November 22, 2024

Team India | రింకూకు జాక్‌పాట్.. ప్రైజ్‌మనీలో ఎవరి వాటా ఎంత ?

టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. రోహిత్ సేన అద్భుతంగా పోరాడి 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా అందించిన సంగతి తెలిసిందే. విక్టరీ పరేడ్ అనంతరం వాంఖడే స్టేడియంలో రూ.125 కోట్ల చెక్ అందజేసింది. అయితే ఈ భారీ మొత్తంలో ఎవరి వాటా ఎంతనే విషయం తేలింది.

దక్షిణాఫ్రికాపై ఫైనల్ ఆడిన ఆటగాళ్లతో పాటు బెంచ్‌కు పరిమితమైన ప్లేయర్లుకూ నజరానా దక్కనుంది. అలాగే టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్‌లకు ప్రైజ్‌మనీ అందనుంది. అంతేగాక సహాయక సిబ్బంది అయిన ఫిజియోలకు, త్రో డౌన్ స్పెషలిస్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌కు నజరానా ఇవ్వనున్నారు. వీళ్లతో పాటు భారత జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లుకు, రిజర్వ్ ప్లేయర్లుగా ఉన్న ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ అందనుంది. అయితే అందరికీ సమాన వాటా పంచలేదు.

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. భారత జట్టులోని 15 మంది సభ్యులు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, సంజు శాంస్, యశస్వీ జైస్వాల్‌కు అలాగే కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు తలా రూ.5కోట్లు ఇవ్వనున్నారు.

అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు తలో రూ.2.5 కోట్లు అందివ్వనున్నారు. సహాయక సిబ్బందిగా ఉన్న తొమ్మిది మందికి తలా రూ.2 కోట్లు ఇవ్వనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు, రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు తలా రూ.కోటి అందివ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement