Friday, November 22, 2024

IND vs SA | దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా.. డిసెంబర్‌ 10 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం

స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లను ముగించుకున్న టీమిండియా ఇప్పుడు సఫారీలతో మూడు సిరీస్‌లు ఆడేందుకు దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. అక్కడ భారత జట్టు టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను ఆడనుంది. ముందు మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌తో టీమిండియా పర్యటన మొదలు కానుంది. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల జట్లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించేంది. సఫారీలతో జరిగే టీ20 సిరీస్‌లో మారోసారి కీలక ఆటగాళ్లు దూరమయ్యారు.

టీమిండియా రెగ్యూలర్‌ సారథి రోహిత్‌ శర్మతో పాటు పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ సీనియర్లను కేవలం టెస్టు సిరీస్‌కే పరిమితమవుతున్నారు. వీరిని కావాలనే సెలక్టర్లు పక్కన పెడుతున్నారా అనే సందేహం అందరికి కలుగుతోంది. వచ్చే ఏడాది వెస్టిండీస్‌-అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్‌ పోటీలు జరగనున్నాయి. అలాంటి సమయంలో సీనియర్లను ఆడించకపోవడంపై అభిమానులు మండి పడుతున్నారు.

భారత మేనేజ్‌మెంట్‌ మాత్రం సీనియర్లకు విశ్రాంతి ఇచ్చామని చేప్తూ వారిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరం చేస్తున్నారు. మరోవైపు హార్ధిక్‌ పాండ్యా కూడా వన్డే ప్రపంచకప్‌ సమయంలో గాయపడి టోర్నీ మధ్య నుంచే వైదొలిగాడు. తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ పాండ్యా ఆడలేక పోయాడు. అయితే కీలకమైన విదేశీ పర్యటన సఫారీ టూర్‌కు అతను అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

- Advertisement -

హార్దిక్‌ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక పోవడంతో అతన్ని భారత సెలక్టర్లు దక్షిణాఫ్రికా సిరీస్‌లకు ఎంపిక చేయలేదు. ఇక స్వదేశంలో జరిగిన ఆసీస్‌ సిరీస్‌లో తొలిసారి సారథ్య బాధ్యతలు అందుకున్న టీ20 స్పెషలిస్ట్‌ సూర్యకుమార్‌ ఆ టోర్నీలో ఆకట్టుకున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో అద్భుతమైన కెప్టెన్సీతో టీమిండియాకు 4-1 తేడాతో సిరీస్‌ గెలిపించాడు. బ్యాట్‌తో పాటు కెప్టెన్సీలోనూ సూర్య ఆకట్టుకున్నాడు. ఇక కీలకమైన దక్షిణాఫ్రికా సవాల్‌కు సిద్ధమయ్యాడు.

డిసెంబర్‌ 10 నుంచి డర్బన్‌ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. సూర్య నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉంది. ఇక ఈసారి ఆసీస్‌ సిరీస్‌లో విశ్రాంతిలో ఉన్న కీలక ఆటగాళ్లు శుభ్‌మాన్‌ గిల్‌, రవీంద్ర జడేజా, కుల్దిప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌లు మళ్లి భారత జట్టులో చేరారు. వీరి రాకతో టీమిండియా మరింతగా పటిష్టంగా మరిందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈ పొట్టి సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా సేవలు అందించనున్నాడు.

ఇక గత సిరీస్‌లో సత్తా చాటుకున్న యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి తమ బ్యాట్‌ను ఝూళిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి గిల్‌ తిరిగి రావడంతో వీరిద్దరిలో ఒకరికే ఓపెనింగ్‌ చేసే చాన్స్‌ ఉంది. ఇక ధనాధన్‌ బ్యాటింగ్‌తో కీలక ఆటగాడిగా మారిన శ్రేయస్‌ అయ్యర్‌ టీమిండియా బ్యాటింగ్‌కు అదనపు బలమని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇషాన్‌ కిషన్‌తో పాటు జితేష్‌ శర్మ వికెట్‌ కీపింగ్‌లో ఆకట్టుకున్నారు.

ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇషాన్‌ తొలి మూడు మ్యాచ్‌లు ఆడాడు. అందులో రెండు హాఫ్‌ సెంచరీలు చేసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు చివరి రెండు మ్యాచ్‌లు ఆడిన జితేష్‌ శర్మ కూడా తనకు లభించిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగించుకున్నాడు. ఇక కొత్త యువ ఫినిషియర్‌గా ముందుకు దూసుకెళ్తున్నా రింకూ సింగ్‌ ఈ సిరీస్‌లో హైలేట్‌గా మారనున్నాడు. అతనికి తుది జట్టులో అవకాశం లభిస్తే సఫారీ బౌలర్లకు కష్టాలు తప్పవనే చెప్పాలి.

మరోవైపు హైదరాబాదీ యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ కూడా ఈ సిరీస్‌లో తన అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2024 కోసం టీమిండియా సెలక్టర్లు యువ ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తూ వారి ప్రతీభను పరీక్షిస్తున్నారు. ఆసీస్‌ సిరీస్‌లో భారీ స్కోర్లు చేయడంలో విఫలమైన తిలక్‌ వర్మ ఈసారి తన సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సిరాజ్‌, కుల్దిప్‌, జడేజాలపై అధిక భారం..

బౌలింగ్‌లో టీమిండియా సీనియర్‌ స్పిన్నర్లు రవీంద్రజడేజా, కుల్దిప్‌ యాదవ్‌తో పాటు హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై భారత మేనేజ్‌మెంట్‌ భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌కు అనకూలించే సఫారీ పిచ్‌లపై బ్యాటర్ల కంటే బౌలర్లపైనే అధిక భారం ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా తరఫున విదేశీ గడ్డపై అత్యధిక మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా వీరికే అధికంగా ఉంది. మరోవైపు అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌లకు కూడా ఈసిరీస్‌ చాలా కీలకం. వ్యక్తిగత కారణాల వలన దీపక్‌ చాహర్‌ టీ20 సిరీస్‌లో ఆడటం అనుమానమే.

అందుకే సిరాజ్‌తో కలిసి అర్ష్‌దీప్‌, ముఖేష్‌లు కూడా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే రవి బిష్ణోయ్‌పై అందరి చూపులు ఉన్నాయి. కానీ ఇప్పటికే సీనియర్లు కుల్దిప్‌, జడేజా జట్టులో ఉండటం ఇతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమనిపిస్తుంది. కానీ ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో బరీలోకి దిగాలనుకుంటే బిష్ణోయ్‌ తుది జట్టులో ఉండటం ఖాయం. ఇటీవల బిష్ణోయ్‌ టీ20ల్లో నెంబర్‌-1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

భారత టీ20 జట్టు (అంచనా): సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మాన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, కుల్దిdప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముఖేష్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌.

టీ20 సిరీస్‌ షెడ్యూల్‌

1వ టీ20 డిసెంబర్‌ 10 కింగ్స్‌మీడ్‌ (డర్బన్‌)

2వ టీ20 డిసెంబర్‌ 12 సెయింట్‌ జార్జ్‌ పార్క్‌ (గ్కెబెర్హా)

3వ టీ20 డిసెంబర్‌ 14 న్యూ వాండరర్స్‌ స్టేడియం (జొహన్నెస్‌బర్గ్‌ )

  • టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
  • ప్రసారాలు: భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌ అన్ని మ్యాచ్‌లు స్టార్‌ నెట్‌వర్క్స్‌, డిస్నీ హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
Advertisement

తాజా వార్తలు

Advertisement