టీమిండియాల ఆటగాళ్లలలో పలువురుకి కరోనా సోకిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెకేషన్ వెళ్లాడు కోహ్లి. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత విరాట్ కు కొవిడ్-19 పాజిటివ్ గా తేలిందని, అయితే ఆ తర్వాత అతడు కోలుకుని ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్ కు వెళ్లడానికంటే ముందు భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కూడా కరోనా సోకడంతో అతడు ఆలస్యంగా వెళ్లనున్నాడట. అశ్విన్, కోహ్లిలతో పాటు మరికొంతమంది టీమిండియా ఆటగాళ్లకు కూడా వైరస్ సోకినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై టీమ్ మేనేజ్మెంట్ అధికారిక ప్రకటనేదీ విడుదల చేయలేదు. కానీ ఇంగ్లండ్ కు వెళ్లిన తర్వాత కోహ్లితో పాటు రోహిత్ శర్మలు యూకే వీధుల్లో షాపింగ్ లకు తిరగడం.. మాస్కులు లేకుండానే బయట కనిపించడంతో ఈ రూమర్లకు ఆజ్యం పోసినట్టైంది. వీరిద్దరితో కలిసి మెలిగిన మరికొందరు క్రికెటర్లు కరోనా బారినపడ్డారని వీరిలో పలువురు జూన్ 24 నుంచి లీస్టర్షైర్ తో మ్యాచ్ ఆడటం కష్టమేనని తెలుస్తుంది. జులై 1 నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా ఇంగ్లండ్ తో భారత జట్టు ఐదో టెస్టు ఆడనుంది.