ముంబై: దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరేముందు భారతజట్టు మూడురోజులపాటు క్వారంటైన్‌లో ఉండనుంది. బయో సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం ఆదివారం సాయంత్రంలోగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఫైవ్‌స్టోర్ హోటల్‌లో హాజరుకావాలని బీసీసీఐ ఆదేశించింది. ఈనేపథ్యంలో దక్షిణాఫ్రికాకు వెళ్లే స్కాడ్ సభ్యులు క్వారంటైన్‌లో ఉండనున్నారు. టీమిండియా బుధవారం చార్టర్ విమానంలో జోహన్స్‌బర్గ్‌కు బయలుదేరనుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారతజట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
ఈక్రమంలో ప్రస్తుతం టెస్టు జట్టులోని సభ్యులు మాత్రమే దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నారు. కాగా నవదీప్‌సైనీ, సౌరభ్‌కుమార్, దీపక్‌చాహర్, హనుమవిహారీ, వివేక్ రామకృష్ణ (టైనర్) ఇప్పటికే దక్షిణాఫ్రికాలో ఉన్నారు. వీరు భారత్ ఎజట్టుతో మూడు అనధికార టెస్టుల్లో ఆడారు. కాగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆధ్వర్యంలో జట్టు సభ్యులు కొందరు మినీక్యాంప్‌లో పాల్గొన్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) నగరంలో నిర్వహించిన శిబిరంలో రోహిత్‌శర్మ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, రిషభ్‌పంత్, శార్దూల్ ఠాకూర్ పాల్గొన్నారు. మూడు టెస్టుల్లో మొదటి బాక్సింగ్ డే టెస్టు సెంచూరియన్‌లో ఈ నెల 26న ప్రారంభంకానుంది. జోహన్స్‌బర్గ్, కేప్‌టౌన్ మరో రెండు టెస్టులకు ఆతిథ్యం ఇవనున్నాయి. మహారాష్ట్రలో కఠిన క్వారంటైన్ నిబంధనలు అమలులో ఉండటంతో ఇండియా ఎ స్క్వాడ్ బ్లూమ్‌ఫోంటెయిన్ నుంచి నేరుగా అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది.