అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. కీలక సమరానికి సిద్ధమవుతోంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జనవరి 25 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అంతేకాదు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజరుకానున్నారు. ఈ వివరాలను హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్-ఇంగ్లండ్ తొలి టెస్ట్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని, అంతర్జాతీయ మ్యాచ్ చూడాలనుకునే సామాన్య ప్రజల కోసం టికెట్ ధరలు తగ్గించామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తామని, రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి రాగానే నేరుగా కలిసి ఈ మ్యాచ్ కు చీప్ గెస్ట్ గా హాజరుకావాలని ఆహ్వానం అందిస్తామన్నారు.
23న బిసిసిఐ అవార్డ్స్ ప్రధానోత్సవం
హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో బీసీసీఐ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం 23న జరుగుతుందని జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ సహా మరికొందరు హాజరవుతారని చెప్పారు. హెచ్‌సీఏ తరఫున వారిని కలిసి తొలి టెస్ట్‌కు హాజరుకావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని జగన్ మోహన్ రావు చెప్పారు. ఈ టెస్ట్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు త్వరలో హైదరాబాద్‌కు రానున్నాయి.