ఇండోర్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బుధవారం ప్రారంభమైన మూడవ టెస్టులో ఆస్ట్రేలియా చెలరేగింది. ఏ స్పిన్ వ్యూహంతో భారత్ తమను దెబ్బతీసిందో, అదే వ్యూహాన్ని ఆతిథ్య జట్టుపై ప్రయోగించి సక్సెస్ అయింది. ఇండోర్ వేదికలో భారత జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తద్వారా, మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిన ఆస్ట్రేలియా మూడవ టెస్టులో గట్టిపోటీనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 4వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్‌ను 33.2 ఓవర్లలోనే 109 పరుగులకు ఆలౌట్ చేయడంతో, మొదటి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. పీటర్ హాండ్స్‌కాంబ్ (7), కామెరూన్ గ్రీన్(6) క్రీజ్‌లో ఉన్నారు. ఉస్మాన్ ఖవాజా (60) హాఫ్ సెంచరీతో రాణించగా, లబుషేక్ (31), స్టీవ్ స్మిత్ (26), ట్రావిస్ హెడ్ (9) ఒకమాదిరి స్కోర్లు చేశారు. ఈ నలుగురిని జడేజా అవుట్ చేశాడు. పుణలో 2017లో ఆస్ట్రేలియాపై 107, 105 పరుగుల తర్వాత భారత్‌కు ఇదే తక్కువ స్కోరు. మొత్తంగా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఆలౌట్ అయిన మ్యాచ్‌లలో ఇది ఐదవ అత్యల్ప స్కోరు.
టీమిండియా బెంబేలు..
టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభమే అందించారు. రోహిత్, శుభ్‌మన్ గిల్ వేగంగానే పరుగులు చేశారు. ఈ టెస్టులోనూ టీమిండియా భారీ స్కోరు చేస్తుందనే విశ్వాసం కలిగింది. కానీ, ఆరో ఓవర్‌లో కుహ్నమాన్ రాకతో పరిస్థితి మారింది. భారత ఇన్నింగ్ పేకమేడలా కూలింది. కేవలం 33.2 ఓవర్లలో ఇన్నింగ్స్ ముగిసింది. మన బ్యాట్స్‌మెన్లలో ఇద్దరు మాత్రమే 20కి పైగా పరుగులు సాధించారు. 22 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలవగా, 21 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్ సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత రోహిత్ (12) ఔటవ్వగా, రెండు ఓవర్ల తర్వాత గిల్ (21)ని కు హ్నమాన్ పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటి తర్వాత లైయన్ విజృంభించి, పుజారా (1), రవీంద్ర జడేజా (4)ను వెనక్కి పంపించాడు. శ్రేయస్‌ను కు హ్నమాన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. జట్టును కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని ఆశించిన విరాట్ కోహ్లీ కూడా తేలిగ్గా ఔటయ్యాడు. 22పరుగులు చేసిన విరాట్ కాస్తా, టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ వెంటనే 25వ ఓవర్‌లో కేఎస్ భరత్ (17) కూడా ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. 84/7 స్కోరుతో రెండవ సెషన్‌ను ప్రారంభించిన భారత్, మరో 25 పరుగులకే చివరి మూడు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ (3), ఉమేష్ యాదవ్ (17), సిరాజ్(0), అక్షర్ పటేల్ (12 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కుహ్నమాన్ ఐదు వికెట్లు పడగొట్టగా, లైయన్ మూడు, మర్ఫీ ఒక వికెట్ తీశారు.
రోహిత్ తడబాటు..
తొలి ఐదు ఓవర్లలో రోహిత్, శుభ్‌మన్ గిల్ ఆరు అద్భుతమైన బౌండరీలు బాదారు. అయితే అక్కడి నుంచి భారత బ్యాటర్లను ట్రాప్ చేసేందుకు ఆస్ట్రేలియా స్పిన్నర్లు విష వల వేశారు. ఈ వలలో మొదట రోహిత్ పడిపోయాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వికెట్లను సమర్పించుకున్నారు. ప్రారంభ ఓవర్‌లోనే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి రోహిత్ తప్పించుకున్నాడు. బంతి బ్యాట్‌ను తాకినట్లు కనిపించినా, ఆస్ట్రేలియా సమీక్షను తీసుకోలేదు. ఈసారి నాలుగో బంతి రోహిత్ బ్యాక్ ప్యాడ్ తగిలింది. ఆసీస్ రివ్యూకి వెళ్లలేదు. దాంతో రోహిత్‌కు మరో జీవనదానం లభించింది. ఈ అవకాశాలను రోహిత్ సద్వినియోగం చేసుకోలేక పోయాడు.
కుహ్నమాన్ 5/16
స్పిన్నర్లకు అనుకూలించే ఇండోర్ పిచ్‌పై కుహ్నమాన్ రెచ్చిపోయాడు. ఏకంగా 5 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ వెన్నువిరిచాడు. మాథ్యూ కుహ్నమాన్ తన రెండవ టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. తొలిసారి ఐదు వికెట్లు తీసిన ఘనతను దక్కించుకున్నాడు. అతడి మేజిక్ బంతుల ధాటికి భారత జట్టు ముప్పై ఓవర్లలోనే ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. పిచ్ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని, భారత పతనానికి బంతిని సెట్ చేశాడు. తొమ్మిది ఓవర్లలో 5/16తో అత్యుత్తమ గణాంకాలను సాధించాడు.
అశ్విన్ నెం-1 (బాక్స్)
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. మొదటి స్థానంలో ఉన్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రెండవ స్థానానికి పడిపోయాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన ద్వారా నంబర్ 1 ర్యాంక్‌ను చేరాడు. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ రాణిస్తే అశ్విన్ ర్యాంకింగ్ మరింత పదిలమవుతుంది. కాగా 40 ఏళ్ల వయసులో నంబర్ 1 ర్యాంక్ సాధించి అశ్విన్ అరుదైన ఆటగాడిగా నిలిచాడు. 1936లో ఆస్ట్రేలియా ఆటగాడు క్లార్రీ గ్రిమ్మెట్ తర్వాత ఇంత పెద్ద వయసులో అగ్రస్థానం దక్కించుకున్న ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. కాగా న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. అశ్విన్‌ను అధిగమించేందుకు ఈ వికెట్లు సరిపోవు. కాగా ఫిబ్రవరి 22 వరకు ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ నంబర్ 1 స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మొదటి స్థానానికి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ఐసీసీ టెస్టు బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ బౌలర్ షాహన్ షా అఫ్రిదీ చెరొక స్థానం ఎగబాకి 4, 5 ర్యాంకుల్లో నిలిచారు. వీరిద్దరూ గతేడాది జులై నుంచి టెస్టు మ్యాచులేమీ ఆడకపోయినా ఈ స్థానాల్లో నిలవడం విశేషం. భారత లెప్ట్nఆర్మ్ స్పిన్నర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన ర్యాంక్‌ను మెరుగు పరచుకుని 8వ ర్యాంక్‌ను సాధించాడు. ఆల్‌రౌండర్లలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అశ్విన్ రెండవ స్థానంలో ఉన్నాడు.