ప్రిక్వార్టర్స్ లో శ్రీజ ఓటమి
టిటిలో భారత్ పోరుకు తెర
పారిస్ ఒలింపిక్స్-2024లో టేబుల్ టెన్నిస్ వ్యక్తిగత విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ ఓటమిపాలైంది. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో రౌండ్-16కు అర్హత సాధించిన తొలి భారత ప్లేయర్లుగా శ్రీజ చరిత్ర వరుసగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. ప్రిక్వార్టర్స్‌లో ఆకుల శ్రీజ చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ షున్ ఇంగ్షా చేతిలో 4-0తో 12-10, 12-10, 11-8, 11-3 సెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
అయితే తెలుగ బిడ్డ ఓటమిని అంత సులువగా అంగీకరించలేదు. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ భయపడేలా పోరాడింది. తొలి సెట్‌లో 10-10 స్కోరు సమంగా నిలిచింది. కానీ ప్రారంభ సెట్‌ను గొప్పగా ముగించలేకపోయింది. చైనా ప్లేయర్ వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలి సెట్‌ను గెలిచింది. ఇక రెండో సెట్‌లోనూ 10-10తో శ్రీజ స్కోరు సమం చేసింది. కానీ అంతిమంగా ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత క్రమంగా పాయింట్లను సమర్పించుకుంది. ఓటమిపాలైనప్పటికీ శ్రీజ పోరాటానికి నెట్టింట్లో మద్దతు లభిస్తుంది.
ప్రపంచ నంబర్ వన్‌తో 24వ ర్యాంకర్ శ్రీజ చేసిన పోరాటం అసాధారణమని కొనియాడుతున్నారు. కాగా, ఈ హైదరాబాద్ అమ్మాయి భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. ఇటీవల ఆమె డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు నమోదు చేసింది. అంతేగాక,డబుల్స్ టైటిల్‌ను కూడా నెగ్గి చరిత్రకెక్కింది. ఈ విశ్వక్రీడల్లో శ్రీజ సింగిల్స్‌తో పాటు డబుల్స్ ఈవెంట్స్‌కు అర్హత సాధించింది.