ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా గ్రూప్ దశ మ్యాచులు ముగిశాయి. గ్రూప్-ఏలో మూడు విజయాలు సహా ఓ మ్యాచ్ రద్దు కావటంతో ఏడు పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఓటమెరుగని రికార్డుతో సూపర్8కు చేరుకుంది. గ్రూప్ దశలో మ్యాచ్‌కు మధ్య విరామం దక్కించుకున్న రోహిత్‌సేనకు సూపర్8లో అటువంటి అవకాశం లేకుండా పోయింది.
సెమీఫైనల్లో చోటు సాధించేందుకు కీలక సూపర్8లో ఆడాల్సిన మూడు మ్యాచులను ఏకంగా ఐదు రోజుల వ్యవధిలోనే ఆడాల్సి ఉంది. ఈ మేరకు భారత్‌కు కఠిన షెడ్యూల్ ఎదురైంది. మూడు మ్యాచ్ లకు మధ్య విరామం అతి తక్కువగా ఉండటంతో నాకౌట్ మ్యాచులకు పేసర్ల ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది!.
సూపర్8లో భారత్ గ్రూప్-1లో నిలిచింది. ఇదే గ్రూప్‌లో అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ సహా ఆస్ట్రేలియా సైతం చోటుచేసుకుంది. సూపర్8లో భారత్ తొలుత అఫ్గనిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో తాడోపేడో తేల్చుకోనుంది. కీలక సూపర్8 కావటంతో ఏ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
స్పిన్‌కు అనుకూలించే కరీబియన్ పిచ్‌లపై అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఎదుర్కొవాల్సి రావటం టీమ్ ఇండియాకు సవాల్‌తో కూడకున్నదే. గురువారం బ్రిడ్జ్‌టౌన్ వేదికగా (జూన్ 20) అఫ్గనిస్థాన్‌తో , శనివారం (జూన్ 22) నార్త్‌సౌండ్ వేదికగా బంగ్లాదేశ్, సోమవారం (జూన్ 24) గ్రాస్‌ఐలెట్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. సూపర్ 8 మ్యాచుల కోసం టీమ్ ఇండియా ఇప్పటికే అమెరికా నుంచి కరీబియన్ దీవులకు చేరుకుంది.