Friday, November 22, 2024

T20WC Super 8 | రేపు అప్గానిస్థాన్ తో భార‌త్ ఢీ..

టీ20 వరల్డ్ కప్‌-2024లో ఆసక్తికర దశ మొదలుకానుంది. బుధవారం నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. లీగ్ స్టేజ్‌లో ఆయా గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ ఫైట్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించగా భారత్ గ్రూప్-1లో ఉంది. కాగా, గురువారం అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

గ్రూప్-ఏలో ఆడిన మూడింట్లో విజయాలతో హోరెత్తించిన భారత్ (వర్షం కారణంగా కెనడా మ్యాచ్ రద్దు) అఫ్గానిస్థాన్‌పై అదే జోరు ప్రదర్శించాలని కసిగా బరిలోకి దిగుతోంది. అయితే గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ రోహిత్ సేన అమెరికాలో ఆడింది. సూపర్ పోరులన్నీ వెస్టిండీస్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో పరిస్థితులకు తగ్గట్లుగా తుది జట్టు కూర్పు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.

బలబలాల పరంగా, గత రికార్డుల దృష్ట్యా అఫ్గానిస్థాన్ భారత్‌దే పైచేయి. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో టీమిండియా ఏడు విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ రద్దైంది. ఈ ఏడాది ఆరంభంలో ఆడిన టీ20 సిరీస్‌ను 3-0తో రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌లో బలమైన న్యూజిలాండ్‌ను అఫ్గాన్ ఓడించింది. ఈ స్థితిలో రషీద్ ఖాన్ బృందాన్నితక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. దీంతో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది.

గేమ్ ఛేంజర్ కుల్‌దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోరావాలని భారత యాజమాన్యం భావిస్తోంది. ఆల్‌రౌండర్ దూబె స్థానంలో కుల్‌దీప్‌ రానున్నాడు. బార్బడోస్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానవకాశాలు ఉంటాయి. అక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఎక్కువసార్లు గెలిచింది. దీంతో టాస్ గెలిస్తే అఫ్గానిస్థాన్‌కు భారీ లక్ష్యాన్ని ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది. ఓపెనర్‌గా విరాట్ కోహ్లికి మరో అవకాశం ఇవ్వాలని చూస్తోంది. లీగ్ స్టేజ్‌లో కోహ్లి ఓపెనర్‌గా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. 1, 4, 0 తో పేలవప్రదర్శన చేశాడు. కానీ కింగ్ కోహ్లిపై మరోసారి నమ్మకం ఉంచి అదే బ్యాటింగ్ ఆర్డర్‌ను కొనసాగించాలనుకుంటుంది.

భారత తుది జట్టు (అంచనా)

- Advertisement -

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

Advertisement

తాజా వార్తలు

Advertisement