టీ20 ప్రపంచకప్ మ్యాచులకు అమెరికాలోని మూడు నగరాలు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే న్యూయార్క్‌లో మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇక ఫ్లోరిడా (ఫోర్ట్ లాడర్డేల్), డల్లాస్‌లో మ్యాచ్‌లు మిగిలున్నాయి. అయితే ఈ వారం కీలక మ్యాచ్‌లు జరగనున్న ఫ్లోరిడా, ఫోర్ట్ లాడర్డేల్లో భారీ వరదల కారణంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో స్థానిక అధికారులు సౌత్ ఫ్లోరిడా విమానాశ్రయాలకు వందలాది విమానాలను క్యాన్సిల్ చేశారు.
పాకిస్థాన్ సూపర్-8 ఆశలపై నీళ్లు..
ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ పాకిస్థాన్ సూపర్-8 అవకాశాలకు గండికొట్టింది. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు టీమిండియా అర్హత సాధించింది. రెండో స్థానం కోసం ఆతిథ్య అమెరికా, పాకిస్థాన్ పోటీ పడుతున్నాయి. ఫోర్ట్ లాడర్డేల్లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్కులో జూన్ 14న ఐర్లాండ్‌తో యూఎస్, 16న పాక్ తలపడతాయి.
అమెరికా, ఐర్లాండ్‌ను ఓడించినా లేదా వర్షంతో మ్యాచ్ రద్దు అయినా సరే యూఎస్ సూపర్- 8కి దూసుకెళుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే, ఆదివారం ఐర్లాండ్‌పై పాక్ గెలిచిననా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. అదే ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోతే మాత్రం ఆదివారం పాకిస్థాన్‌కు అవకాశం ఉంటుంది.