Thursday, November 21, 2024

T20WC | ఐర్లాండ్ చేతిలో పాక్ భ‌విష్య‌త్…

బహుశా.. తొలిసారి పాకిస్థాన్‌ అభిమానులు టీమ్‌ఇండియా గెలవాలని కోరుకుని ఉంటారు. దానికి కారణం టీ20 ప్రపంచ కప్‌లో తమ ‘సూపర్ – 8’ అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారత్ – యూఎస్‌ఏ మ్యాచ్‌ ఫలితం వారికి అత్యంత కీలకం. యూఎస్‌ఏపై టీమిండియా విజయం సాధించడంతో పాక్‌ ఊపిరి పీల్చుకుంది. అయితే, ఇప్పుడు అమెరికా, పాక్‌ జట్ల భవితవ్యం ఐర్లాండ్‌ చేతిలో ఉండటం గమనార్హం.

ఆ ఒక్కటి ఎవరికి?

గ్రూప్ – ఎలో ఐదు జట్లు తలపడుతున్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు సూపర్ -8 కి చేరతాయి. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన టీమ్‌ఇండియా మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే తదుపరి దశకు దూసుకుపోయింది. ఇక ఈ గ్రూప్‌ నుంచి ఒక్క జట్టుకే ఛాన్స్‌ ఉంది. మరి ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మిగిలిన నాలుగు జట్లకూ అవకాశాలు ఉన్నాయి.

యూఎస్‌ఏ:

వరుసగా రెండు మ్యాచుల్లో విజయం. భారత్‌ చేతిలో ఓటమితో ప్రస్తుతం యూఎస్‌ఏ 4 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో (జూన్ 14న) తలపడాల్సి ఉంది. ఇందులో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా సూపర్ – 8కి చేరుతుంది. ఒకవేళ ఓడినా కాస్త అవకాశం ఉంది. పాక్‌ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి.

- Advertisement -

పాకిస్థాన్‌:

యూఎస్‌ఏ, భారత్‌ చేతిలో ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్‌ ఎట్టకేలకు టీ20 ప్రపంచ కప్‌లో కెన‌డాతో ఆడి తొలి విజయం నమోదు చేసింది. దీంతో పాయింట్ల ఖాతాను తెరిచింది. తన చివరి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటే.. పాక్‌కు సూపర్ – 8 ఛాన్స్‌ ఉంటుంది. పైన చెప్పినట్లు యూఎస్‌ఏ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఐర్లాండ్‌తోనే పాక్‌ (జూన్ 16న) చివరి మ్యాచ్‌ ఆడనుంది. అయితే, శుక్రవారమే పాక్‌ భవితవ్యంపై ఓ స్పష్టత రానుంది. ఒకవేళ రేపు జరిగే మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనా.. యూఎస్‌ఏ గెలిచినా పాక్‌ ఇంటిముఖం పట్టినట్లే. ఇక తన చివరి మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఒకటే.

కెనడా:

ఈ జట్టుకు సాంకేతికంగా మాత్రమే అవకాశం ఉంది. తన చివరి మ్యాచ్‌లో భారత్‌ను కెనడా ఢీకొట్టనుంది. ఇందులో భారీ విజయం సాధించి ఇప్పుడున్న -0.493 నెట్‌రన్‌రేట్‌ను +0.127కైనా తీసుకురావాలి. ఆ జట్టు ఫామ్‌.. ప్రత్యర్థి టీమ్‌ఇండియా ప్రదర్శన ముందు కష్టమే. మరోవైపు ఫ్లోరిడాలో వర్షం ముప్పు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అప్పుడైనా కెనడా నిష్క్రమణ తప్పదు.

ఐర్లాండ్‌:

రెండు జట్ల సూపర్ – 8 అవకాశాలు ఇప్పుడు ఐర్లాండ్‌ చేతిలో ఉన్నాయి. యూఎస్‌ఏతో జూన్ 14, పాక్‌తో జూన్ 16న ఐర్లాండ్‌ తలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిపోయిన ఐర్లాండ్‌ ఇక మరింత ప్రమాదకరంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ రెండు మ్యాచుల్లో ఐర్లాండ్‌ గెలిచినా.. తర్వాత దశకు చేరుకుంటుందన్న భరోసా లేదు. ఆ జట్టు నెట్‌రన్‌రేట్ (-1.712) చాలా తక్కువగా ఉంది. భారీ విజయాలను నమోదు చేస్తేనే కాస్త ఛాన్స్‌ ఉంటుందేమో.

Advertisement

తాజా వార్తలు

Advertisement