Saturday, June 29, 2024

T20WC | ఆతిథ్య జట్టుకు నిరాశ.. సెమీస్‌లోకి ద‌క్షిణాఫికా

టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆరు పాయింట్లతో టేబుల్ టాపర్‌గా సెమీస్‌కు దూసుకెళ్లింది. మరోవైపు వెస్టిండీస్ రెండు పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.

మందకొడి పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (52; 42 బంతుల్లో, 3 ఫోర్లు, రెండు సిక్సర్) అర్ధశతకం సాధించాడు. షంసీ (3/27) మూడు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 15 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు.

వర్షం పడటంతో మ్యాచ్ ఆలస్యంగా తిరిగి ప్రారంభమైంది. అంతేగాక ఓవర్లను కుదించారు. దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 136 పరుగుల నుంచి 17 ఓవర్లకు 124 పరుగులుగా నిర్ణయించారు. స్లోపిచ్‌పై ప్రతి పరుగూ కీలకమే. కానీ వరుణుడు రాకతో సౌతాఫ్రికాకు మూడు ఓవర్లతో పాటు 12 పరుగుల టార్గెట్ తగ్గింది. దీన్ని అయిదు బంతులు (16.1 ఓవర్లలో) మిగిలుండగా సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే దక్షిణాఫ్రికా ఛేజింగ్ అంత ఈజీగా సాగలేదు. ఆఖర్లో ఉత్కంఠగా కొనసాగింది.

రెండో ఓవర్‌లో రసెల్ ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చాడు. సూపర్ ఫామ్‌లో డికాక్ (12; 7 బంతుల్లో, 3 ఫోర్లు) తెలివిగా బోల్తా కొట్టించిన రసెల్ హెండ్రిక్స్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. వరుణుడి బ్రేక్ అనంతరం మార్క్‌రమ్ (18; 15 బంతుల్లో, 2 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (29; 27 బంతుల్లో, 4 ఫోర్లు) దూకుడుగా పరుగులు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మార్క్‌రమ్ ఔటైనప్పటికీ సౌతాఫ్రికా పవర్‌ప్లేలో 41 పరుగులు చేసింది.

ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ (22; 10 బంతుల్లో, 3 ఫోర్లు, 1 ఫోర్) చెలరేగడంతో సౌతాఫ్రికా విజయం దిశగా అడుగులు వేసింది. కానీ వెస్టిండీస్ బౌలర్లు గొప్పగా పుంజుకుని తిరిగి పోటీలోకి వచ్చారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ విజయ సమీకరణాన్ని 12 బంతుల్లో 13 పరుగులుగా మార్చారు.

- Advertisement -

బంతి అందుకున్న రోస్టన్ ఛేజ్ 16వ ఓవర్ అయిదు బంతులకు నాలుగు పరుగులే ఇచ్చాడు. కానీ చివరి బంతికి రబాడ ఫోర్ బాదాడు. దీంతో ఆఖరి దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో అయిదు పరుగులు అవసరమయ్యాయి. జేన్సన్ (21 నాటౌట్; 14 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) తొలి బంతికే సిక్సర్ బాది జట్టును గెలిపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement