Tuesday, December 3, 2024

T20WC | పాకిస్థాన్‌కు చావు దెబ్బ‌..

టీ20 ప్రపంచకప్‌-2024లో పాకిస్తాన్‌ ప్రయాణం ముగిసింది. పేలవ ప్రదర్శనతో వరుస పరాజయాలతో చతికిలపడ్డ బాబర్‌ ఆజం బృందాన్ని దురదృష్టం కూడా వెంటాడింది. అమెరికా- ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్‌ సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు ఈసారి కనీసం సెమీస్‌ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టింది. మరోవైపు.. గ్రూప్‌-ఏ టాపర్‌గా సూపర్‌-8లో అడుగుపెట్టిన టీమిండియాతో పాటు అమెరికా కూడా తదుపరి దశకు అర్హత సాధించింది.

బాబర్‌ ఆజంకు మరో చేదు అనుభవం..

గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ పాకిస్తాన్‌ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్‌ కూడా చేరుకుండానే ఐసీసీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో అతడు జట్టు ఓటములకు బాధ్యత వహిస్తూ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత బాబర్‌ ఆజం స్థానంలో టెస్టులకు షాన్‌ మసూద్‌, టీ20లకు షాహిన్‌ ఆఫ్రిది కెప్టెన్లుగా నియమితులయ్యారు. అయితే, వీరి సారథ్యంలో ఘోర పరాజయాలు.. అదే విధంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో మార్పుల అనంతరం.. బాబర్‌ ఆజం మళ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఆ సిరీస్‌లో వైట్‌వాష్‌

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీకి ముందు పీసీబీ అతడి పునర్నియామకానికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. వన్డే, టీ20 జట్లకు సారథిగా ప్రకటించింది. అయితే, బాబర్‌ కెప్టెన్సీలో తొలుత ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆడిన పాకిస్తాన్‌ వైట్‌వాష్‌(2-0)కు గురికాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో పరాజయాల పరంపర కొనసాగింది.

- Advertisement -

అమెరికా చేతిలో చిత్తు

గ్రూప్‌-ఏలో టీమిండియా, ఐర్లాండ్‌, కెనడా, అమెరికాలతో పాటు ఉన్న పాకిస్తాన్‌.. తొలుత అమెరికా (సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం), అనంతరం టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. తద్వారా సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు.. ఆతిథ్య అమెరికా తొలుత కెనడా.. తర్వాత పాకిస్తాన్‌ను ఓడించి మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో కెనడాపై విజయం సాధించిన పాకిస్తాన్‌.. అమెరికా- ఐర్లాండ్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆశలు పెట్టుకోగా అది కాస్తా వర్షం వల్ల రద్దైంది.

ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే అవుట్‌

ఫలితంగా అమెరికా ఖాతాలో ఐదు పాయింట్లు చేరగా.. కేవలం రెండు పాయింట్లే కలిగి ఉన్న పాక్‌.. తమకు ఐర్లాండ్‌తో మిగిలిన మ్యాచ్‌లోనూ గెలిచినా లాభం లేకుండా పోయింది. ఐరిష్‌ జట్టుపై పాక్‌ గెలిచినా నాలుగు పాయింట్లే అవుతాయి కాబట్టి.. అమెరికాపై పైచేయి సాధించలేదు. దీంతో అమెరికా సూపర్‌-8కు చేరగా.. బాబర్‌ బృందం గ్రూప్‌ దశ కూడా దాటలేక నిష్క్రమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement