టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ.. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది.
ఇక చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఛేజింగ్ సాఫీగా సాగలేదు. నువాన్ తుషార్ (4/18) ధాటికి 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడిన జట్టును తౌహిద్ (40), లిటన్ దాస్ (36) ఆదుకున్నారు. ఇక చివర్లో మహ్మదుల్లా (16 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాను గెలిపించాడు.
అంతకముందు బ్యాటింగ్ చేపిన శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సాంక (47) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరంభంలోనే లంక వికెట్లు కోల్పోయినా పవర్‌ప్లేలో 53 పరుగులు సాధించింది. కానీ అదే జోరును ఇన్నింగ్స్ ఆఖరి వరకు కొనసాగించలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు క్రమంగా వికెట్లు సాధిస్తూ శ్రీలంక బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. చివరి అయిదు ఓవర్లలో శ్రీలంక 24 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్, రిషద్ హొస్సేన్ చెరో మూడు, తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 19 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.