Friday, November 22, 2024

Australia vs Oman : ప్రపంచ కప్ లో ఆసీస్ బోణి – ఒమన్ పై విజయం

టీ20 వరల్డ్ కప్-2024లో ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. బార్బడోస్ వేదికగా గురువారం ఒమన్‌తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్ స్వరూపాన్ని, బంతితో మ్యాచ్ గమనాన్ని మార్చిన మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), (3-0-19-3)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56; 51 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), స్టొయినిస్ అర్ధశతకాలు సాధించారు. మెహ్రన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అయితే ఆసీస్ ఇన్సింగ్స్ మొదట్లో చాలా నెమ్మదిగా సాగింది. 12 ఓవర్లకు 63/3 స్కోరు మాత్రమే సాధించింది. ఆ తర్వాత స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. మెహ్రన్ ఖాన్ వేసిన 15వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లతో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 27 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. మరో ఎండ్‌లో వార్నర్ జాగ్రత్తగా ఆడుతూ అతనికి సహకరించాడు. 46 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. స్టొయినిస్-వార్నర్ నాలుగో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరి ధాటికి చివ‌రి 8 ఓవర్లలో ఆసీస్ 101 పరుగులు చేసింది.

- Advertisement -

అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో ఒమన్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అయాన్ ఖాన్ (36; 30 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. స్టోయినిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. స్టార్క్, ఎలిస్, జంపా తలో రెండు వికెట్లు తీశారు. ఒమన్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆది నుంచి క్రమంగా వికెట్లు కోల్పోయింది. 57 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో వచ్చిన మెహ్రన్ ఖాన్ (27; 16 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి అయాన్ ఓటమి అంతరాన్ని తగ్గించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement