Wednesday, November 20, 2024

T20: 3 పరుగుల తేడాతో గెలిచిన వెస్టిండీస్..

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా షార్జాలో జరిగిన బంగ్లాదేశ్‌-వెస్టిండీస్ మ్యాచ్ హై టెన్ష‌న్‌గా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరకు వెస్టిండీస్ జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది.

వెస్టిండీస్ టాపార్డర్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4), హెట్‌మెయిర్ (9), ఆండ్రీ రస్సెల్ (0) విఫలమయ్యారు. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో మైదానాన్ని వీడిన కెప్టెన్ పొలార్డ్ మళ్లీ వచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు. పొలార్డ్ ఆట చివరికి 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

లోయరార్డర్ లో వచ్చిన నికోలస్ పూరన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 22 బంతులు ఎదుర్కొన్న పూరన్ 1 ఫోర్, 4 సిక్సర్లు బాదాడు. రోస్టన్ చేజ్ 39 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 2, ముస్తాఫిజుర్ 2, ఇస్లామ్ 2 వికెట్లు తీశారు.

అనంతరం 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను 139/5 స్కోరే చేయగలిగింది. ఓపెనర్‌గా వచ్చిన షకీబ్ (9) విఫలమయ్యాడు. లిట్టన్ దాస్ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. దాస్ (44), కెప్టెన్ మహ్మదుల్లా (31) పోరాడినా విజయం మాత్రం దక్కలేదు. విండీస్ బౌలర్లలో రాంపాల్, హోల్డర్, బ్రావో, రసెల్, హుస్సేన్‌లకు తలో వికెట్ దక్కింది. కాగా ఈ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు ఇదే తొలి విజయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement