దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్ 9వ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. గ్రూప్-బిలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సఫారీ అమ్మాయిలు 10 వికెట్ల తేడాతో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించారు. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన వెస్టీండ్‌కు దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హడలెత్తించారు. వీరి ధాటికి కరీబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులే చేసింది.
స్టేఫనే టేలర్ (44; 41 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్) మినహా మిగతా బ్యాటర్లు రాణించలేక పోయారు. సఫారీ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నొన్కులులెకో లబా 4 వికెట్లతో విజృంభించగా.. మారిజానే కాప్ పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు తంజీమ్ బ్రిట్స్, కెప్టెన్ లౌరా వొల్వార్డ్ట్ అదిరే ఆరంభాన్ని అందించారు.
తొలి బంతి నుంచే చెలరేగి ఆడిన వీరు అజేయ అర్ధ శతకాలతో తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. దీంతో సఫారీ జట్టు 17.5 ఓవర్లలోనే వికెట్ నష్ట పోకుండా ఆడుతూ పాడుతూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి వరకు అజేయంగా నిలిచిన లౌరా 55 బంతుల్లో 7 ఫోర్లతో 59 పరుగులు చేయగా.. తంజీమ్ 52 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 57 పరుగులు చేసింది.