Friday, November 22, 2024

T20 – ఉత్కంఠ పోరు లో విశ్వ విజేత ఇండియా

:పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. ఆఖ‌రి ఓవ‌ర్ వ‌రకూ ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ద‌క్షిణాఫ్రికా తొలి టైటిల్ ఆశ‌ల‌కు చెక్ పెట్టింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టి 11 ఏండ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ స‌గ‌ర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఛేద‌న‌లో హెన్రిచ్ క్లాసెన్(52) సుడిగాలి ఇన్నింగ్స్‌తో భ‌య‌పెట్టినా హార్దిక్ పాండ్యా(3/20), బుమ్రా(2/18), లు మ్యాచ్‌ను మ‌లుపుతిప్పారు. ఆఖ‌రి ఓవ‌ర్లో రెండు వికెట్లు తీసిన పాండ్యా భార‌త్‌కు 7 వికెట్ల విజ‌యాన్ని అందించాడు. అంతే.. చోక‌ర్స్ ముద్ర ప‌డిన దక్షిణాఫ్రికా ఒత్తిడిని జ‌యించ‌లేక ట్రోఫీ చేజార్చుకుంది.

భార‌త్ బార్బ‌డోస్‌లో అద్భుతం చేసింది. ‘నువ్వా నేనా’ అన్న‌ట్టు సాగిన హోరాహోరీ పోరులో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని సాధించింది. ఆల్‌రౌండ్ షోతో స‌ఫారీల‌ను మ‌ట్టిక‌రిపించి రెండో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకుంది. హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు మ‌ర్చిపోలేని కానుక అందించింది. తొలుత విరాట్ కోహ్లీ(76) స‌ఫారీ బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ హాఫ్ సెంచ‌రీ బాదాడు. రిష‌భ్ పంత్(0), సూర్య‌కుమార్‌(3)ల త‌ర్వాత వ‌చ్చిన అక్ష‌ర్ ప‌టేల్‌(47) అటాక్ ఇన్నింగ్స్‌తో హ‌డలెత్తించాడు. ఆఖ‌ర్లో శివం దూబే(27) ధ‌నాధ‌న్ ఆడ‌డంతో భారత జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి176 ర‌న్స్ కొట్టింది.

పొట్టి ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్లో ఛేద‌న‌లో స‌ఫారీ జ‌ట్టును భార‌త స్పీడ్‌స్ట‌ర్లు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు వ‌ణికించారు. బుమ్రా త‌న తొలి ఓవ‌ర్లోనే ఓపెన‌ర్ రీజా హెండ్రిక్స్(4)ను బౌల్డ్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ షాక్‌లోనే ఉన్న స‌ఫారీల‌ను అర్ష్‌దీప్ త‌న రెండో ఓవ‌ర్లో దెబ్బ‌కొట్టాడు. ఎడెన్ మర్క్‌ర‌మ్(4)ను ఔట్ చేసి ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ట్రిస్ట‌న్ స్ట‌బ్స్(31) జ‌త‌గా ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్(39) వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నాడు. వీళ్లిద్ద‌రూ ఆచితూచి ఆడ‌డంతో 6 ఓవ‌ర్ల‌కు స‌ఫారీల స్కోర్.. 43-2.

మూడో వికెట్‌కు 58 ర‌న్స్ చేసిన డికాక్, స్ట‌బ్స్ అక్ష‌ర్ ప‌టేల్ విడ‌దీశాడు. డేంజ‌ర‌స్‌గా క‌నిపిస్తున్న స్ట‌బ్స్‌ను బౌల్డ్ చేసి ప‌రుగుల వ‌ర‌ద‌కు అడ్డుక‌ట్ట వేశాడు. అనంత‌రం హెన్రిచ్ క్లాసెన్ (52) జ‌త‌గా డికాక్ చెల‌రేగిపోయాడు. ప్రమాద‌కరంగా మారిన ఈ జోడీని అర్ష్‌దీప్ సింగ్ విడ‌దీసి భార‌త శిబిరంలో ఆనందాన్ని నింపాడు. అయితే.. ఆ సంతోషాన్ని క్లాసెన్ ఆవిరి చేస్తూ అక్ష‌ర్ ప‌టేల్ వేసిన 15వ ఓవ‌ర్లో వ‌రుస‌గా 4, 6, 6, 4 కొట్టాడు. దాంతో, స‌మీక‌ర‌ణం ఒక్క‌సారిగా 30 బంతుల్లో 30 ప‌రుగుల‌కు మారింది. కానీ, 17వ ఓవ‌ర్ తొలి బంతికే పాండ్యా బిగ్ ఫిష్ క్లాసెన్‌ను వెన‌క్కి పంపాడు.

- Advertisement -

ఆ త‌ర్వాత .. బుమ్రా త‌న ఆఖ‌రి ఓవ‌ర్‌లో విండీస్‌పై గెలిపించిన మార్కో జాన్‌సెన్(2)ను బౌల్డ్ చేయ‌డంతో స‌ఫారీలు ఒత్తిడిలో ప‌డ్డారు. అర్ష్‌దీప్ 19వ ఓవ‌ర్‌లో ర‌న్స్ ఇవ్వ‌డంతో ఆఖ‌రికి 16 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. పాండ్యా తొలి బంతికి మిల్ల‌ర్ భారీ షాట్ ఆడ‌గా.. బౌండ‌రీ వ‌ద్ద సూర్య‌కుమార్ యాద‌వ్ అద్భుతంగా క్యాచ్ ప‌ట్టాడు. అంతే.. రోహిత్ సేన‌తో పాటు స్టేడియ‌మంతా ఇండియా.. ఇండియా నినాదాల‌తో మార్మోగింది. రెండు వికెట్లు తీసిన పాండ్యా టీమిండియాకు 7 ప‌రుగుల విజ‌యాన్ని అందించాడు

జస్ప్రీత్ బుమ్రా “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌.. టీ 20 లకు కోహ్లీ గుడ్ బై

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కోహ్లీ “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌“గా, జస్ప్రీత్ బుమ్రా “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌“గా నిలిచారు. కాగా, ఇదే తన చివరి టీ20 ప్రపంచకప్ అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement