Sunday, January 19, 2025

Australian Grand Slam | ప్రి క్వార్టర్స్‌లో స్వియాటెక్‌, సిన్నర్ !

ఆస్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ జన్నిక్‌ సిన్నర్‌, రెండో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ అలవోకగా ప్రి క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. మరోవైపు నాలుగో సీడ్స్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌, జాస్మీన్‌ పౌలీనిలకు భారీ షాక్‌ తగిలింది. టైటిల్‌ ఫేవరెట్లలో ఉన్న వీరు మూడో రౌండ్‌లోనే ఇంటి బాట పట్టారు.

వరల్డ్‌ నెం.1 జన్నిక్‌ సిన్నర్‌ (ఇటలీ) 6-3, 6-4, 6-2 తేడాతో మార్కొస్‌ గీరొన్‌ (అమెరికా)ను వరుస గేముల్లో చిత్తు చేశాడు. దాదాపు రెండు గంటల్లోనే మ్యాచ్‌ను ముగించి ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు.

8వ సీడ్‌ అలెక్స్‌ డి మీనౌర్‌ (ఆస్ట్రేలియా) 5-7, 7-6 (7-3), 6-3, 6-3తో ఫ్రాన్సిస్కో కెరుండోలొ (అర్జెంటీనా)పై చెమటోడ్చి నెగ్గాడు. మరోవైపు అమెరికా యువ స్టార్‌ 21వ సీడ్‌ బెన్‌ షెల్టన్‌ 6-3, 3-6, 6-4, 7-6 (7-5)తో 16వ సీడ్‌ లొరెన్జో ముసెట్టి (ఇటలీ)ను షాకిచ్చాడు.

మరోవైపు నాలుగో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై ఫ్రాన్స్‌ యువ ఆటగాడు గేల్‌ మోన్ఫీల్స్‌ సంచలన విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్‌ ఇంకో మ్యాచ్‌లో 13వ సీడ్‌ హోల్గర్‌ రూనే (డెన్మార్క్‌) ఐదు సెట్ల మ్యాచ్‌లో మిరోమిర్‌ (సెర్బియా) ప్లేయర్‌పై చెమటోడ్చి నెగ్గాడు.

స్వియాటెక్ అల‌వోక‌గా… పౌలీని కు షాక్‌

- Advertisement -

మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో పోలాండ్‌ స్టార్‌ స్వియాటెక్‌ 6-1, 6-0 తేడాతో యూకే యువ సంచలనం ఎమ్మా రాడుకానుపై ఏకపక్షంగా విజయం సాధించింది.

మరో మ్యాచ్‌లో మాత్రం నాలుగో సీడ్‌, ఇటలీ స్టార్‌ క్రీడాకారిణి జాస్మిన్‌ పౌలీనిపై 28వ సీడ్‌ ఎలీనా స్విటోలినా 2-6, 6-4, 6-0తో సంచలన విజయం సాధించింది.

ఇతర మ్యాచుల్లో 6వ సీడ్‌ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌) 6-3, 6-4తో డయానా యస్ట్రేమ్‌స్కా (ఉక్రేయిన్‌)ను, 9వ సీడ్‌ డారియా కసట్కీనా (రష్యా) 7-5, 6-1తో కజకిస్తాన్‌కు చెందిన యులియా పుటిన్‌ట్సెవాను ఓడించి టోర్నీలో ముందంజ వేశారు.

అన్‌ సీడెడ్‌ వెరోనికా కుదెర్‌మెటోవా (రష్యా) 6-4, 6-2 తేడాతో 15వ సీడ్‌ హద్దాద్‌ మియా (బ్రజిల్‌)ను చిత్తు చేసి నాలుగో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఇద్దరు అమెరికా ప్లేయర్ల మధ్య జరిగిన కీలక పోరులో 19వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ 6-4, 6-4తో 10వ సీడ్‌ డానిల్లె కొలిన్స్‌పై నెగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement