ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరల్డ్ నెం.1 ఇగా స్వియాటెక్, 12వ సీడ్ జాస్మిన్ పౌలీని టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6-2, 6-4 తేడాతో మూడో సీడ్ అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌ను చిత్తు చేసి ఫైనల్లో దూసుకెళ్లింది. ఏక పక్షంగా సాగిన ఈ పోరులో ప్రపంచ నెంబర్-1 స్వియాటెక్ అమెరికా యువ క్రీడాకారిణిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇక్కడ జరిగిన మరో సెమీస్‌లో 12వ సీడ్ జాస్మిన్ పౌలీని (ఇటలీ) 6-3, 6-1 తేడాతో మీరా ఆండ్రీవా (రష్యా) టీనేజర్‌ను చిత్తు చేసి ఫైనల్స్‌లో ప్రవేశించింది.
ముగిసిన బోపన్న-ఎబ్డెన్ పోరాటం..
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్ రోహన్ బోపన్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ బోపన్న (భారత్)-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 2-7, 6-2, 2-6 తేడాతో 11వ సీడ్ ఇటలీ జంట సిమోనె బొలెలీ-ఆండ్రియా వవసోరి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.