దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో జనవరి 28న (ఆదివారం) జరిగిన మ్యాచ్‌లతో గ్రూప్ దశ ముగిసింది. ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 201 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్ సిక్స్‌కు చేరుకుంది. ఇక రేపటి నుంచి సూపర్ సిక్స్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా, భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.
సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన జట్లు..
గ్రూప్ దశలోని నాలుగు గ్రూప్‌లలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 12 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన 12 జట్లను రెండు గ్రూపులుగా (గ్రూప్ 1, గ్రూప్ 2) విభజించి మ్యాచ్‌లు ఆడిస్తారు. గ్రూప్ దశలోని గ్రూప్ ఏ, డీ నుంచి సూపర్ సిక్స్‌కు చేరుకున్న ఆరు జట్లను ఒక్క గ్రూప్‌గా.., గ్రూప్ బీ, సీ నుంచి సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన ఆరు జట్లను మరో గ్రూప్‌గా విభజిస్తారు.
కాగా, గ్రూప్ A, D నుండి భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్ ఆరు జట్లు సూపర్ సిక్స్‌లోని గ్రూప్ 1లో చోటు దక్కించుకున్నాయి. ఇక, గ్రూప్ B, C నుండి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే జట్లు సూపర్ సిక్స్‌లోని గ్రూప్ 2 లో తలపడనున్నాయి.
సూపర్ సిక్స్ దశలో సంబంధిత గ్రూప్‌లోని జట్లు తమ ప్రత్యర్థులతో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాయి. అందుటో భాగంగా భారత్ జట్టు, న్యూజిలాండ్, నేపాల్ జట్లతో తలపడనుంది. ఇక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 6, 8 తేదీల్లో జరగాల్సి ఉంది. ఫైనల్ ఫిబ్రవరి 11న జరగనుంది, మొత్తం మూడు నాకౌట్ గేమ్‌లు బెనోనిలో జరగనున్నాయి.