Saturday, September 7, 2024

IPL : సూపర్ హిట్టో హిట్.. ఆల్‌టైమ్ రికార్డులన్నీ బ్రేక్!

ఐపీఎల్-2024 ముగిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తుదిపోరు ఏకపక్షంగా సాగినా ఈ సీజన్ మాత్రం హోరాహొరీగా సాగింది. క్రికెట్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందాయి. స్టేడియం బయటపడిన సిక్సర్లు, వికెట్లు ఎగిరిపడిన వికెట్లు, మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలతో ఈ సీజన్ వినోదాన్ని పంచింది.

ఇక మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో రికార్డుల మోత మోగాయి. సగటున మ్యాచ్‌కో అరుదైన ఘనతలు నమోదయ్యాయి. రసవత్తరంగా మ్యాచ్‌లు సాగడంతో రికార్డులు పోటెత్తాయి. ఐపీఎల్‌ చరిత్రలో 2024 సీజన్ ప్రత్యేకంగా నిలిచేలా రికార్డులు నమోదయ్యాయి. లీగ్‌ హిస్టరీలో ఈ సీజన్‌లో నమోదైన రన్ రేటే (9.56) అత్యధికం. అంటే ఈ సీజన్ ఇన్నింగ్స్‌ సగటు స్కోరు ఏకంగా 191.

- Advertisement -

ఇక ఐపీఎల్-2024లో 200+ స్కోర్లు ఏకంగా 41 సార్లు నమోదవ్వడం విశేషం. అంతేగాక బ్యాటర్లు 1260 సిక్సర్ల మోత మోగించారు. ఈ సీజన్‌లో 14 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఇవన్నీ ఆల్‌టైమ్ రికార్డులు. ఈ సీజన్‌లో అత్యధిక టీమ్ స్కోరు, అత్యధిక ఛేజింగ్ స్కోర్ల రికార్డులు బద్దలయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన 287 పరుగులు లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.

ఈ సీజన్‌లో రికార్డు ఛేదన కూడా నమోదైంది. ఛాంపియన్ కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ 262 పరుగుల స్కోరు ఛేదించింది. లీగ్ హిస్టరీలో ఇదే టాప్ ఛేజింగ్ స్కోరు. ఇక అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ రికార్డు కూడా ఈ సీజన్‌లోనే సాధ్యమైంది. బెంగళూరు వేదికగా ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 549 పరుగులు నమోదయ్యాయి. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో అంతిమంగా హైదరాబాద్ గెలిచింది. అయితే ఈ సీజ‌న్ లో అత్య‌థిక ప‌రుగులు చేసిన స‌న్ రైజ‌ర్స్ అత్య‌ల్ప ప‌రుగులు చేసిన రికార్డ్ 113 కూడా ఆ జ‌ట్టుదే కావ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement