ఐపిఎల్ 2024 లో భాగంగా గురువారం నాడు సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు హైదరాబాద్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం ఎస్ ఆర్ హెచ్ అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. దీంతో వేలాది రూపాయలు పోగేసి కొన్న మ్యాచ్ టిక్కెట్లు వృథా అయ్యాయి. అయితే తమ అభిమానుల కోసం సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు వచ్చిన ప్రేక్షకుల డబ్బును వాపస్ ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే ప్రేక్షకులకు డబ్బును రీఫండ్ చేయబోతున్నట్లు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది.
దీని ప్రకారం పేటిఎం ఇన్సైడర్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన వారికి వారి డబ్బు తిరిగి జమ కానుంది. దీని కోసం ఫ్రాంఛైజీ ఇమెయిల్ ద్వారా టికెట్లు కొన్న వారిని సంప్రదిస్తుంది. అయితే వాస్తవానికి, చాలా మంది అభిమానులు బ్లాక్ లో టికెట్లు కొన్నారు. ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. దీంతో బ్లాక్ లో టికెట్లు కొన్నవారంతా తెగ బాధపడిపోతున్నారు.
టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కావ్య మారన్ ఫ్రాంచైజీకి కోట్లలో నష్టం వాటిల్లనుంది. హైదరాబాద్ మ్యాచ్ల టిక్కెట్ ధర సాధారణంగా రూ.750 నుండి ప్రారంభమవుతుంది. స్టేడియం సామర్థ్యం 35 వేలు. ఇలాంటి పరిస్థితిలో, ఫ్రాంచైజీ టిక్కెట్లు అమ్మడం ద్వారా ప్రతి మ్యాచ్లో కోట్ల ఆదాయం వస్తోంది.