Tuesday, November 26, 2024

IPL : స‌న్ సెమీ ఫైన‌ల్స్ తంత్రం…

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్దమైంది. టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. అసాధారణ ప్రదర్శనతో పాటు అదృష్టం కూడా కలిసి రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు సిద్దమైంది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైనల్ చేరాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. మరోవైపు తిరుగులేని ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచిన కేకేఆర్.. అదే జోరులో సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవాలనుకుంటుంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు హోరా హోరీగా సాగడం గమనార్హం.

వ్యూహాత్మక మార్పు..

ఈ క్రమంలోనే క్వాలిఫయర్-1 కూడా థ్రిల్లర్‌గా సాగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్‌ గురించి ప్యాట్ కమిన్స్‌కు మంచి అవగాహన ఉంది. ఇదే వికెట్‌పై అతను ఆసీస్‌కు వరల్డ్ కప్ అందించాడు. ఈ క్రమంలోనే క్వాలిఫయర్-1కు అతను వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో టీమ్ కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. బెంచ్‌కే పరిమితమైన న్యూజిలాండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్‌ను రంగంలోకి దించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడని అతన్ని ఔటాఫ్ సిలబస్‌లా బరిలోకి దింపవచ్చు.

ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే..

ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం మార్కో జాన్సెన్ బరిలోకి దిగుతాడు. తుది జట్టులో మార్పులు చేయాలనుకుంటే విజయకాంత్ వియాస్కాంత్‌పై వేటు పడుతోంది. లేదంటే విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడనుండగా.. రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.

ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అయితే ట్రావిస్ హెడ్, నటరాజన్‌లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకోనున్నారు. ఉనాద్కత్‌ను జట్టులోకి తీసుకుంటే సన్వీర్ సింగ్ ఉద్వాసనకు గురవుతాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, షెహ్‌బాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్/గ్లేన్ ఫిలిప్స్/మార్కో జాన్సెన్

ఇంపాక్ట్ ప్లేయర్: నటరాజన్

Advertisement

తాజా వార్తలు

Advertisement