భారత స్టార్ మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సుమిత్ రెడ్డి-సిక్కి రెడ్డి జోడీ చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్ అనుపమ ఉపాద్యయ సంచలనం సృష్టించింది. తొలి రౌండ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ను మట్టి కరిపించింది. ఇతర సింగిల్స్ పోటీల్లో ఆకర్శి కశ్యప్, ప్రియాన్షు రజావత్‌లకు భారీ షాక్‌లు తగిలాయి.
కాగా, మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో తెలుగు షట్లర్లు సుమిత్-సిక్కి జోడీ 23-21, 17-21, 21-17 తేడాతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్-జెనీ గాయ్ జంటపై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశారు. ఇక మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో 19 ఏళ్ల భారత యువ షట్లర్ అనుపమ ఉపాద్యయ 21-17, 8-21, 22-20 తేడాతో చైనా స్టార్ వీవెన్ జాంగ్‌పై సంచలన విజయం సాధించింది.
మరో సింగిల్స్‌లో ఆకర్శి కశ్యప్ (భారత్) 10-21, 18-21 తేడాతో జపాన్‌కు చెందిన తొమోక మియజాకి చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో భారత యువ స్టార్ షట్లర్ ప్రియాన్షు రజావత్ 24-22, 13-21, 18-21 తేడాతో చికో వార్దోయో (ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడాడు. ఫలితంగా తొలి రౌండ్‌లోనే రజావత్ పోరాటం ముగిసింది.