Saturday, November 23, 2024

RCB : ముగిసిన ఆర్సీబి క‌థ‌…అంద‌రూ స్టార్సే… అయినా లీగ్ దాట‌ని జ‌ట్టు

ఐపీఎల్‌-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్ రేసు నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది.

- Advertisement -

ఆర్సీబీ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే ఈ మ్యాచ్‌తో కలిపి వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉండేది. కానీ కీలక మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు ఆడియాశలయ్యాయి. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. కేవలం ఒక విజయం మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలై -1.046 రన్‌రేటుతో పదో స్థానంలో నిలిచింది.

విరాట్ నాటౌట్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి చెత్త అంపైరింగ్‌కు బలయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతుంది. కోహ్లీ సైతం అంపైర్ల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. డగౌట్‌లోనూ ఆగ్రహంగా కనిపించాడు.

హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18) రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ బంతి అతని ఛాతి కంటే ఎత్తులో ఫుల్‌టాస్‌గా రాగా.. విరాట్ కోహ్లీ డిఫెండ్ చేశాడు. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేవగా.. హర్షిత్ రాణా అందుకున్నాడు. అంపైర్లు ఔట్ ఇవ్వగా ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు.
అయితే బంతి నడుము కంటే ఎత్తులో వచ్చినా అతను క్రీజు బయట ఉన్నాడని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అసహనంతో వారిపై నోరు పారేసుకున్నాడు. ఇక ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ అంబటి రాయుడు అంపైర్ల తీరును తప్పుబట్టాడు. ఇది ముమ్మాటికి నాటౌట్‌ అని, అత్యంత చెత్త నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘ఇది చాలా పెద్ద నిర్ణయం. విరాట్ కోహ్లీ బిగ్ వికెట్. అంపైర్లు ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకునే ముందు కళ్లు మూసుకుంటారా? అత్యంత చెత్త అంపైరింగ్’అని రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్‌జ్యోత్ సింగ్ సిద్దు సైతం అది క్లియర్ నోబాల్ అని అభిప్రాయపడ్డాడు. మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అంపైర్ల తీరుపై తప్పుబడుతున్నారు. ఈ సీజన్‌లో అంపైర్ల తీరు చాలా నాసిరకంగా ఉందని మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement