స్టార్ పేసర్ మహ్మద్ షమి అతి త్వరలోనే భారత జట్టులో తిరిగి చేరుతాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అనంతరం షమి టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. చీలమండల గాయంతో తొలుత జట్టుకు దూరమైన షమి, అనంతరం లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నాడు.
ఇటీవల ప్రాక్టీస్ మొదలుపెట్టిన షమి వేగంగా బంతులు సంధిస్తున్నాడు. అయితే మునపటిలా పూర్తిస్థాయి తీవ్రతతో షమి బౌలింగ్ చేయట్లేదు. పూర్తిఫిట్‌నెస్ సాధించడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే టీమిండియాకు షమి ఎంతో కీలకమని, ఆస్ట్రేలియా పర్యటన కోసం ఈ మ్యాచ్ విన్నింగ్ పేసర్ విషయంలో జాగ్రత్త వహిస్తున్నామని జై షా తెలిపాడు.
“ఆస్ట్రేలియా పర్యటనలో షమి అవసరం ఎంతో ఉంది. అతను అనుభవజ్ఞుడు” అని జైషా అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై షమికి మెరుగైన రికార్డు ఉంది. ఎనిమిది టెస్టులు ఆడిన అతను 32 సగటుతో ఏకంగా 31 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు అయిదు వికెట్లు తీశాడు. అయితే షమి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అవుతాడా లేదా అనేది ఎన్సీఏ ఇచ్చే క్లియరెన్స్‌పై ఆధారపడి ఉందని జైషా అన్నాడు.
”ఆస్ట్రేలియా సిరీస్‌లో షమి ఆడతాడా లేదా అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది. ఎన్సీఏ ఇచ్చే రిపోర్ట్‌పై ఇది ఆధారపడి ఉంది” అని జైషా పేర్కొన్నాడు. కాగా, ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ కొనసాగుతాడని జైషా స్పష్టం చేశాడు. 2021 డిసెంబర్లో ఎన్సీఏ హెడ్‌గా లక్ష్మణ్ బాధ్యతలు అందుకున్నాడు. వచ్చే నెలలో అతని పదవీ కాలం ముగియనుంది. కానీ మరికొంతకాలం లక్ష్మణ్ ఎన్సీబీ బాధ్యతలు నిర్వహిస్తాడని జైషా పేర్కొన్నాడు.
కాగా, నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.