Wednesday, November 20, 2024

హైద‌రాబాద్ కి స్టార్ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఘ‌న‌స్వాగ‌తం

తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖ‌త్ జ‌రీన్ శ‌నివారం హైద‌రాబాద్ కి తిరిగివ‌చ్చారు. కాగా ఈమె వ‌రుస‌గా రెండోసారి మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్ గా నిలిచారు. ఢిల్లీ వేదికగా గత ఆదివారం ముగిసిన ప్రపంచ బాక్సింగ్ టోర్నమెంట్ లో నిఖత్ 50 కిలోల విభాగంలో వరుసగా రెండోసారి బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ నిలిచింది.శంషాబాద్ విమానాశ్రయంలో నిఖత్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో క్రీడా శాఖ అధికారులు ఎయిర్ పోర్టులో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఓపెన్ టాప్ జీప్ లో త్రివర్ణ పతాకాలతో నిఖత్ ను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తాను గెలిచిన పతకం, ట్రోఫీని చూపిస్తూ నిఖత్ ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఈ.ఆంజనేయ గౌడ్, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణు గోపాల చారి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముండేశ్వరి నాథ్, రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు, వివిధ క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు, నిఖత్ కుటుంబ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement