సాన్ సాల్వెడార్: సెంట్రల్ అమెరికాలోని సాల్వడోరన్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. రాజధానికి ఈశాన్యంగా 25 మైళ్ల (41 కిలోమీటర్లు) దూరంలో ఉన్న కుస్కట్లాన్‌లోని మాన్యుమెంటల్ స్టేడియంలో అలియాంజా -ఎఫ్‌ఎఎస్ క్లబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ రణరంగంగా మారినట్లు నేషనల్ సివిల్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. స్టేడియం పూర్తిగా నిండిపోయింది.
అంతా ప్రశాంతంగా మ్యాచ్ చూస్తున్నారు. ఇంతలో రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. క్రమంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం దాకా వచ్చింది. దాంతోచుట్టుపక్కల కూర్చుని ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక మిగతావాళ్లు కూడా బయటకు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. అదికాస్తా తొక్కిసలాటకు దారితీసింది. గాయపడిన వారిలో కనీసం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. స్థానిక టెలివిజన్ తొక్కిసలాట ఘటనను ప్రత్యక్ష ప్రసారం చేసింది.