శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక మరో రోజు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఇక తొలి టెస్టులో శ్రీలంకపై ఆసీస్ 10వికెట్ల తేడాతో నెగ్గగా.. అంతకుమించి దెబ్బకు దెబ్బ తీస్తూ.. శ్రీలంక ఏకంగా ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో గెలిచి తమ సత్తా చూపించింది. తద్వారా ఈ సిరీస్ 1-1తేడాతో సమమైంది. ఈ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా దినేష్ చండిమాల్ నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రభాత్ జయసూర్య నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే… తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 364 స్కోర్ చేసింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్ (145పరుగులు 272 బంతుల్లో 16 ఫోర్లు నాటౌట్), మార్నస్ లబూషేన్ (104 పరుగులు 156 బంతుల్లో 12 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. ఇక శ్రీలంక బౌలర్లలో తన అరంగేట్ర టెస్టులోనే 6వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడు రజిత 2, తీక్షణ, రమేష్ మెండిస్ తలా ఒక వికెట్ తీసి సత్తా చాటారు. ఇక నాలుగో రోజు శ్రీలంక 431/6 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగింది. దినేష్ చండిమాల్ 206 నాటౌట్‌తో చెలరేగిపోవడం, అతడికి తోడుగా కమిందు మెండిస్ (61)తో పాటు టెయిలెండర్లు సహకరించడంతో 554 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. చండిమల్‌కు ఇది అతడి కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, మిచెల్ స్వీప్సన్ 3, నాథన్ లియాన్ 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లు శ్రీలంక బౌలర్ల ధాటికి తేలిపోయారు. కనీసం 190 పరుగుల ఆధిక్యాన్ని కూడా అధిగమించలేక చతికిల పడ్డారు. మరోసారి స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆస్ట్రేలియా బ్యాటర్ల తుక్కురేగ్గొట్టాడు. అతని దెబ్బకు ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా (29), మార్నస్ లబూషేన్ (32), స్టీవ్ స్మిత్ (0), మిచెల్ స్టార్క్ (0), కామెరున్ గ్రీన్ (23), స్వెప్సన్ (0) తోకముడిచారు. తొలి ఇన్నింగ్స్‌లో అర డజను వికెట్లు తీసిన ప్రభాత్ జయసూర్య.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అరడజన్ వికెట్లు తీసి ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. దీంతో ఆసీస్ 151లకే ఆలౌటైంది. లంక బౌలర్లలో ప్రభాస్ జయసూర్య 6 వికెట్లు పడగొట్టగా, మహీష్ థీక్షణ, రమేశ్ మెండిస్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మూడు టీ20లు, 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. టీ20 సిరీస్ పర్యాటక ఆసీస్ సొంతం కాగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య లంక కైవసం చేసుకుంది. ఇక మొదటి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో లంక ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమమైంది.
1992 తర్వాత ఇదే తొలిసారి..
ఆస్ట్రేలియాపై శ్రీలంక జట్టు 1992 తర్వాత తొలిసారి 500కు పైగా పరుగులు నమోదు చేయడం ఇదే తొలిసారి. దినేష్ చండిమాల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక జట్టు ఈ ఫీట్ సాధించగలిగింది. ఇక 1992లో ఆస్ట్రేలియాపై శ్రీలంక టెస్టుల్లో 500 పరుగులకు పైచిలుకు స్కోరు చేయగలిగింది. అప్పట్లో అర్జున రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు 8వికెట్ల నష్టానికి 547పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అంత భారీ స్కోరు చేసినప్పటికీ ఆ మ్యాచ్‌లో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో 554 పరుగులు చేసిన లంక జట్టు ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది.
స్కోరుబోర్డు :
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 364
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 554
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 151
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.