ఆసియా కప్‌ని శ్రీలంక గెలుచుకుంది. ఆరు దేశాల క్రికెట్ జట్లు పోటీపడ్డా ఈ కప్ కోసం ఆఖరికి లంకను విజయం వరించింది. జట్టునిండా మ్యాచ్ విన్నర్లతో నిండిన పాకిస్థాన్ ను చిత్తు చేస్తూ ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక విజేతగా అవతరించింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ ను 23 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా సగర్వంగా టైటిల్ ఎగురేసుకెళ్లింది. పాక్ జట్టు 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.
కాగా, శ్రీలంక ఖాతాలో ఇది 6వ ఆసియా కప్ టైటిల్. శ్రీలంక జట్టు గతంలో 1986, 1997, 2004, 2008, 2014లోనూ టైటిల్ సాధించింది. అత్యధిక టైటిళ్ల విషయంలో టీమిండియా 7 టైటిళ్లతో ముందంజలో ఉంది. వాస్తవానికి ఈ కప్ 2020జులైలో జరగాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా సెప్టెంబర్‌కు2020కి వాయిదా పడింది. కానీ, అప్పటికి పరిస్థితుల్లో ఎట్లాంటి మార్పు లేకపోవడంతో జూన్ 2021కి మరోసారి వాయిదా వేశారు. అయితే ఈ సారి శ్రీలంక వేదికగా ఈ పోటీ జరగాల్సి ఉండగా.. లంకలో నెలకొన్ని ఆర్థిక సంక్షోభం, రాజకీయ కారణాల కారణంగా మ్యాచ్‌లు నిర్వహించలేమని జులై 21న ఆ దేశం స్పష్టం చేసింది.
ఇక.. జులై 27న ఏసీసీ (ఏషియన్ క్రికెట్ కౌన్సిల్) అరబ్ ఎమిరేట్స్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు యూఏఈలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో ఫుల్ మెంబర్లుగా ఉన్న ఐదు దేశాలైన అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంకతో పాటు.. ఈసారి కొత్తగా హాంకాంగ్ జట్టు క్వాలిఫై అయ్యింది. ఈ ఆరు దేశాలు ఆసియా కప్‌లో పోటీపడ్డాయి.
ఇక.. డిపెండబుల్ చాంపియన్‌గా ఉన్నా ఇండియా సూపర్ 4 దశలోనే ఎలిమినేట్ అయ్యింది. ఈ సారి కూడా ఇండియానే కప్ కొట్టుకొస్తుందని అంతా ఎదురు చూశారు. కానీ, కొన్ని బ్యాటింగ్, బౌలింగ్ పరంగా తలెత్తిన ఇబ్బందుల కారణంగా టీమిండియా అంతగా రాణించలేకపోయింది. గత సీజన్ 2018లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇండియా కుర్రాళ్లు ఆసియా కప్‌ని సాధించారు.