శ్రీలంకతో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలకు శుభారంభం దక్కలేదు. భారత ఓపెనర్లు షెఫాలీవర్మ (10), స్మృతి మంధాన (6) ఇద్దరూ విఫలమయ్యారు. అయితే జెమీమా రోడ్రిగెజ్ (76) అదిరిపోయే ఆటతీరుతో చెలరేగింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) అండగా నిలిచింది. వీళ్లిద్దరూ వెనుతిరిగిన తర్వాత దయాలన్ హేమలత (13 నాటౌట్), రిచా ఘోష్ (9), పూజా వస్త్రాకర్ (1), దీప్తి శర్మ (1 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 150/6 స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు.
ఏ దశలోనూ కోలుకోలేకపోయిన ఆ జట్టులో ఓపెన్ హర్షిత సమరవిక్రమ (26), హాసిని పెరేరా (30) మాత్రమే రాణించారు. వీళ్లు కాకుండా కేవలం ఒషాది రణసింఘే (11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు వేసిన ఎక్స్‌ట్రాలే 13 కావడం గమనార్హం. మిగతా బ్యాటర్లందర్నీ ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్ల ధాటికి.. లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఆసియా కప్ టోర్నీని ఘనవిజయంతో ప్రారంభించింది. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లతో చెలరేగగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. రాధా యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. బ్యాటుతో అదరగొట్టిన జెమీమా రోడ్రిగెజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.