మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. గ్రూప్-ఎలో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది.
పాక్ తరఫున కెప్టెన్ ఫాతిమా సనా (30; 20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగగా.. నిద దార్ (23), ఒమైమా సోహైల్ (18) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో చమరీ ఆటపట్టు, సుగంధిక కుమారి, ఉదేశిక ప్రబోధని చెరో 3 వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంకకు బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం శ్రీలంక బ్యాటర్లు ఛేదించలేక పోయారు. పాక్ బౌలర్ల ధాటికి లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులే చేయగలిగింది. నిలాక్షిక సిల్వ (22), విశ్మి గుణరత్నే (20) ఇద్దరే రెండంకెళ్ల స్కోరును దాటగలిగారు. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్ 3 వికెట్లతో విజృంభించగా.. ఫాతిమా, ఒమైమా, నష్ర సంధూ తలో 2 వికెట్లు పడగొట్టి తమ జట్టుకు ప్రపంచకప్‌లో శుభారంభాన్ని అందించారు.