ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును రోజుల వ్యవధిలోనే బద్దలు కొట్టిన ఘనత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది. పవర్‌ప్లేలో బ్యాటింగ్ ఎలా చేయాలో క్రికెట్ ప్రపంచానికి సరికొత్త విధానాన్ని పరిచయం చేసింది. బెదురులేని బ్యాటర్లతో పరుగులు వరద పారించి సునాయాసంగా విజయాలు సాధించింది. కానీ ఛేదనలో మాత్రం సన్ రైజర్స్ బలహీనంగా కనిపిస్తోంది.
ఈ సీజన్‌లో సొంతమైదానంలో సీఎస్కేతో జరిగిన మ్యాచ్ మినహా ఛేజింగ్‌లో సన్‌రైజర్స్ గెలవలేకపోయింది. అంతేగాక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ అప్రోచ్ కూడా భిన్నంగా ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన తెలుగు జట్టు 11.76 ఎకానమీ రేటుతో పరుగులు చేసింది. ఏకంగా 76 సిక్సర్లు బాదింది. కానీ నాలుగు మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో ఆడిన హైదరాబాద్ 8.76 ఎకానమీ రేటుతో స్కోరు సాధించింది.
మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా రెండు మ్యాచ్‌లు కోల్పోయింది. ఉప్పల్‌లో ఆర్సీబీ, చెపాక్‌లో సీఎస్కే చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ జట్టు టాప్-4లో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తిరిగి తప్పక గెలుపు బాట పట్టాలి.
ఈ నేపథ్యంలో సొంతమైదానంలో రేపు (గురువారం) రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించాలని సన్‌రైజర్స్ కసితో రగిలిపోతుంది. తుదిజట్టు కంటే వ్యూహాల్లో స్వల్ప మార్పులు చేయాలని భావిస్తోంది. ఆది నుంచి ముగింపు వరకు అందరూ దూకుడు విధానమే అవలంబించకుండా సందర్భాని బట్టి బ్యాటింగ్ చేయాలని భావిస్తోంది.
ప్లాన్-ఏ ప్రకారం మునపటిలానే ఎటాకింగ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకుంది. ఒకవేళ పవర్‌ప్లేలోనే ఓపెనర్లను కోల్పోతే ఎయిడెన్ మార్కర్‌మ్‌తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పేలా ‘ప్లాన్-బీ’ని సిద్ధం చేసింది. అప్పటికీ ప్లాన్-బీ విఫలమైతే హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్ సంయమనంతో ఆడుతూ ఆఖర్లో చెలరేగేలా ‘ప్లాన్-సీ’ రచించింది. మొత్తంగా మొదట బ్యాటింగ్ అయినా, ఛేజింగ్ అయినా వికెట్లను ఈజీగా సమర్పించుకోకుండా ప్రణాళిక ప్రకారం హిట్టింగ్ చేయాలని సన్‌రైజర్స్ ప్లాన్ చేస్తోంది.