Thursday, November 21, 2024

Sports: భారత్‌ ఎ – దక్షిణాఫ్రికా ఎ మధ్య టెస్టు డ్రా

జోహన్స్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్‌ ఎ జట్టు-దక్షిణాఫ్రికా ఎ జట్టు మధ్య జరిగిన మూడో అనధికార టెస్టు డ్రా అయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ సరెల్‌ ఎర్వీ 180 బంతుల్లో 8ఫోర్లుతో 75పరుగులు చేసి సైనీ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సఫారీ బ్యాటర్లలో టోనీ (58), జోండో (56) హాఫ్‌సెంచరలతో ఆకట్టుకున్నారు. మొత్తంమీద తొలి ఇన్నింగ్స్‌లో 94.5ఓవర్లలో 268పరుగులు చేసిన దక్షిణాఫ్రికా 268పరుగులు చేసి ఆలౌటైంది. భారత్‌ బౌలర్లో దీపక్‌ చాహర్‌ 4, నవదీప్‌ సైనీ 3, సౌరభ్‌ కుమార్‌ 2వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ జట్టు 90.1ఓవర్లలో 276పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్‌ హనుమ విహారీ 170బంతుల్లో 6ఫోర్లు, ఓ సిక్స్‌తో 63పరుగులుచేసిఅర్ధశతకం నమోదు చేయగా, ఇషాన్‌ కిషన్‌ 153బంతుల్లో 12ఫోర్లు, ఓ సిక్స్‌తో 91పరుగులుచేసి ఔటయ్యాడు.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ సరేల్‌ ఎర్వీ 97పరుగులు చేసి త్రుటిలో సెంచరీని కోల్పోగా, వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హవ్జూ 192బంతుల్లో 125పరుగులు చేసి సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. 86ఓవర్లలో 3వికెట్లుకు 313పరుగులు చేసిన సఫారీజట్టు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. చివరిరోజు ఆట పూర్తయ్యేసరికి భారత్‌ ఎ జట్టు 17ఓవర్లలో 3వికెట్లుకు 90పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీషా (38) పరుగులుచేయగా హనుమ విహారీ (13), ఇషాన్‌కిషన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. కాగా మ్యాచ్‌కు ముందు టీమిండియాలో కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలకలం రేపింది. కోచింగ్‌ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. మరోసారి వైద్యపరీక్షలు చేయగా వాటిలో నెగిటివ్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా బ్లూంఫౌంటేన్‌ వేదికగా భారత్‌ ఎ, దక్షిణాఫ్రికా ఎ జట్ల మధ్య జరుగుతున్న అనధికార టెస్టు సందర్భంగా ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. తొలుత ఇద్దరు సభ్యులకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాజిటివ్‌గా తేలింది. అయితే తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో వైద్య ఫలితాలు తప్పుగా తేలినట్లు క్రికెట్‌ దక్షిణాఫ్రికా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించారని స్థానికి మీడియా తెలిపింది. టీమిండియా సభ్యులకు నెగిటివ్‌ రావడంతో మ్యాచ్‌ను యథాతథంగా కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement