Tuesday, November 26, 2024

Sports: ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో శ్రీకాంత్‌.. పసిడి పతకానికి ఒక్క విజయం దూరం..

హువెలా: స్పెయిన్‌లోని హువెలాలో జరిగిన బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత షట్లర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. సెమీస్‌పోరులో హోరాహోరీగా జరిగిన పోరులో శ్రీకాంత్‌ మరో భారత షట్లర్‌ లక్ష్యసేన్‌పై 17-21, 21-14, 21-17తేడాతో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. తొలిసెట్‌ను శ్రీకాంతత్‌ 17-21తేడాతో ఓడిపోయినా అనంతరం మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ అనూహ్యంగా పుంజుకుని 21-14, 21-17తో వరుస సెట్లలో గెలిచి జయభేరి మోగించాడు. ప్రపంచ ఛాంపియన్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా నిలిచిన శ్రీకాంత్‌ తుదిపోరులో పోరాడి ఓడినా రజతం సాధించిన మొదటి భారత షట్లర్‌గా రికార్డుల్లో ఎక్కనున్నాడు.

ఆరంభంలో శ్రీకాంత్‌కు సేన్‌ షాక్‌
పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో తొలిసారి ఇద్దరు భారత షట్లర్లు ఫైనల్‌ బెర్త్‌కోసం బరిలోకి దిగి హోరాహోరీగా పోరాడారు. 12వ సీడ్‌, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌, అన్‌సీడెడ్‌ లక్ష్యసేన్‌ సెమీఫైనల్లో తలపడ్డారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత షట్లరు పోరాడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ మొదటి రెండు పాయింట్లతో ముందడుగు వేసినా లక్ష్యసేన్‌ 2-2తో సమం చేశాడు. అనంతరం శ్రీకాంత్‌ 4-2తో మళ్లిd ఆధిక్యలోకి దూసుకువెళ్లాడు. సీనియర్‌ శ్రీకాంత్‌ను వెంటాడిన 20ఏళ్ల సేన్‌ స్కోరు 4-4, 6-6సమంచేస్తూ పోరాడాడు. ఆ తర్వాత 7-8తో తొలిసారి సేన్‌ ఆధిక్యం సాధించాడు. శ్రీకాంత్‌ లోపభూయిష్ఠ ఆటతో సేన్‌ తన ఆధిక్యాన్ని 11-8కు పెంచుకున్నాడు. శ్రీకాంత్‌ మరో రెండుపాయింట్లు సాధించడంతో స్కోరు 10-13కు చేరింది. అయితే లక్ష్యసేన్‌, శ్రీకాంత్‌ హోరాహోరీగా పోరాడటంతో స్కోరు 16-16కు చేరింది. అనంతరం లక్ష్యసేన్‌ దూకుడును శ్రీకాంత్‌ నిలువరించలేకపోవడంతో తొలి సెట్‌ను కోల్పోయాడు. మొదటిసెట్‌ను లక్ష్యసేన్‌ 21-17తేడాతో సొంతం చేసుకున్నాడు.

అనూహ్యంగా పుంజుకున్న శ్రీకాంత్‌
మొదటి సెట్‌ గెలుపుతో రెండో సెట్‌ను అదేజోరుతో ప్రారంభించిన సేన్‌ 5-3 ఆధిక్యాన్ని సాధించి ఆ తర్వాత 8-4కు తన ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. అనూహ్యంగా పుంజుకున్న శ్రీకాంత్‌ వరుసగా ఆరు పాయింట్లు సాధించి 12-10తో ముందంజ వేశాడు. తన అనుభవాన్ని ఉపయోగించి యువ ఆటగాడు సేన్‌ను అడ్డుకున్న ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ రెండోసెట్‌ను 21-14తో గెలుచుకున్నాడు. ఇద్దరు చెరో సెట్‌ గెలుచుకోవడంతో ఫలితం నిర్ణయాత్మక మూడోసెట్‌కు చేరింది. మూడోసెట్‌లో లక్ష్యసేన్‌ వరుసగా రెండు పాయింట్లు సాధించినా శ్రీకాంత్‌ ప్రశాంతంగా 5-4లీడ్‌ సాధించాడు. ఇరువురు స్మాష్‌లతో విరుచుకుపడటంతో స్కోరు7-7తో సమమైంది. అయితే నిర్ణయాత్మక సెట్‌లో శ్రీకాంత్‌ చేసిన తప్పిదాలను సదినియోగం చేసుకున్న సేన్‌ 11-8తో ఆధిక్యంతో పైచేయి సాధించాడు.

ఆ తరాత 13-13, 16-16తో మరోసారి స్కోరు సమం అవడంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. శ్రీకాంత్‌ దూసుకుపోవడంతో 19-16తేడాతో రెండు పాయింట్లు దూరంలో ఫైనల్‌కు చేరువగా నిలిచాడు. చివరకు 21-17తో లక్ష్యసేన్‌ను ఓడించిన శ్రీకాంత్‌ ప్రపంచ ఛాంపియన్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా సువర్ణాధ్యాయం సృష్టించినా పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి..ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఇప్పటివరకు 12పతకాలు సాధిస్తే భారత పురుష షట్లర్లు ఇద్దరు మాత్రమే రెండు కాంస్య పతకాలు సాధించారు.1983లో ప్రకాష్‌ పడుకొణ కాంస్యం గెలుచుకోగా అనంతరం 36సంవత్సరాలు తర్వత 2019లో సాయిప్రణీత్‌ కాంస్య పతకం సాధించి ఈ జాబితాలో రెండో భారత షట్లర్‌గా నిలిచాడు. ఈక్రమంలో భారత బ్యాడ్యింటన్‌ చరిత్రలో మొట్టమొదటిసారి కనీసం రజత పతకం శనివారం ఖాయమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement