Friday, November 22, 2024

Sports Special – వైక‌ల్యాన్ని గెలిచారు! పతకాల వేటలో పారా అథ్లెట్లు

పారిస్ పారాలింపిక్స్​లో ఏపీ, తెలంగాణ క్రీడాకారులు
వారి క్రీడా పోరాటం స్ఫూర్తిదాయకం
దీప్తిది పుట్టుక‌తోనే వైక‌ల్యం
అయినా.. చిరుత‌ను మించిన ప‌రుగు త‌న సొంతం
కృత్రిమ కాలుతో క‌బ‌డ్డీలో రాణిస్తున్న నారాయ‌ణ‌
వెన్నెముక విరిగినా వెనుతిర‌గ‌ని రామకృష్ణ‌
కాలు కోల్పోయినా థైక్వాండాలో అర్ష‌ద్ బెస్ట్‌
భార‌త్‌కు ప‌త‌కాల‌ను సాధిస్తున్న మ‌న క్రీడాకారులు

అది వారిలో కేవలం శారీరక వైకల్యం మాత్రమే.. మానసికంగా వారెంతో ఫిట్​ అన్నది వారి తీరును చూస్తేనే తెలుస్తోంది. ఈ జీవితం ఇంతటితో ఆగిపోవద్దు.. ఏదో సాధించాలన్న తపన వారిని వైకల్యాన్ని అధిగమించేలా చేసింది. దేశ సేవలో భాగంగా జమ్ములో డ్యూటీలో ఉన్నప్పుడు మందుపాతర పేలి ఒకతను కాలు కోల్పోయాడు.. మరో పేదింటి ఆడబిడ్డకు పుట్టుకతోనే వైకల్యం ఉంది.. ఇట్లా చాలామంది తమ శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణిస్తున్నారు. పారిస్​ పారాలింపిక్స్​లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టి పతకాలు సాధించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన పారా అథ్లెట్లు రెడీ అయ్యారు. ఈ నెల 28న పారిస్‌లో ప్రారంభమయ్యే ​ పోటీల్లో తలపడనున్నారు. వైకల్యాన్ని దాటి పతకాల వేటకు సై అంటున్నారు. ఈ బ‌రిలో దిగేది ఎవ‌రు? వారి స్ఫూర్తిదాయక ప్రస్థానం ఏంటో చ‌దివి తెలుసుకుందాం.

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ – వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన అమ్మాయి దీప్తి. ఆమె తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి కూలీ పనులు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న అర ఎకరం భూమి కూడా అమ్మేసుకున్నారు. అయితే మరోవైపు దీప్తి చిన్నప్పటి నుంచి వేగంగా పరుగెత్తెతూ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ దృష్టిలో పడింది. దీంతో దీప్తిని హైదరాబాద్​కు తీసుకొచ్చారు. ఆ త‌ర్వాత ఆమె పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించడం ప్రారంభించింది. జీవాంజి దీప్తికి పుట్టుకతోనే మానసిక వైకల్యం. మరోవైపు పేదరికం. ఎన్నో అవమానాలు. కానీ తనకు వచ్చిన పరుగునే నమ్ముకుని ముందుకెళ్లింది. దీంతో ఇప్పుడామె ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అలా పారిస్​ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ క్రీడల్లో మహిళల టీ20 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగుతోంది.

- Advertisement -

ఆసియా క్రీడ‌ల్లో రికార్డు ప్ర‌ద‌ర్శ‌న‌..

గత ఏడాది జ‌రిగిన ఆసియా పారా క్రీడల్లో రికార్డు ప్రదర్శన చేసి దీప్తి పసిడి ప‌త‌కం గెలిచింది. అప్పుడు దక్కిన ప్రైజ్ మనీ ₹30 లక్షలతో తల్లిదండ్రులకు మళ్లీ భూమి కొని ఇచ్చింది. ఇంకా ఈ ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణాన్ని గెలుచుకుంది. అలానే ప్రపంచ రికార్డు ప్రదర్శనతో(55.07 సెకన్లు) పారిస్​ పారాలింపిక్స్​కు అర్హత సాధించింది.

కృతిమ కాలుతో..
కొంగనపల్లి నారాయణది నంద్యాల జిల్లాలోని ప్యాపిలి. రాష్ట్ర స్థాయిలో కబడ్డీలో రాణించేవాడు. ఈ క్రమంలోనే 2007లో సైన్యంలో చేరాడు. అయితే.. జమ్మూలో విధులు నిర్వర్తిస్తుండగా మందుపాతర పేలి అతడి ఎడమ కాలు తీవ్రంగా గాయపడింది. దీంతో డాక్టర్లు ఆ కాలు తొలగించారు. అయితే.. ఈ విషాదం నుంచి కోలుకుని కృత్రిమ కాలును అమర్చుకున్నాడు. అప్పుడే కల్నల్‌ గౌరవ్‌ దత్తా పరిచయంతో పారా క్రీడల వైపు మళ్లాడు. రోయింగ్‌ను ఎంచుకున్నాడు. బాగా పట్టు సాధించి అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్​ని అందుకున్నాడు. ఆసియా పారా క్రీడల్లో మిక్స్​డ్​ విభాగంలో సిల్వర్ మెడల్​ను సాధించాడు. ఈ ప్రదర్శనతో పారిస్​ పారాలింపిక్స్​కు అర్హత సాధించాడు.

వెన్నెముక గాయపడినా
మరోవైపు ఆంధ్రాకు చెందిన పారా షూటర్‌ శ్రీహర్ష రామకృష్ణ కూడా పారాలింపిక్స్‌ కోసం సిద్ధమయ్యాడు. 2022లో 10మీ.మిక్స్‌డ్‌ ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌2 వర్లడ్​ కప్​లో గోల్డ్ మెడల్ సాధించి ఈ పారాలింపిక్స్​కు అర్హత సాధించాడు. 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీహర్ష వెన్నెముక గాయపడింది. అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు.

కాలు కోల్పోపోయినా..

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన అర్షద్‌ షేక్​ తైక్వాండోలో రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఏడో తరగతి చదివే సమయంలో రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలును మోకాలి వరకు పోయింది. అయినా అతడు మనోధైర్యం కోల్పోలేదు. చదువుకుంటూనే క్రీడా పోటీల్లోనూ రాణించేవాడు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రోత్సాహం వల్ల జాతీయ, అంతర్జాతీయ పారా సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొని మెడల్స్​ సాధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా రోడ్‌ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌ ఎలైట్‌ వ్యక్తిగత టైమ్‌ ట్రయల్‌ సీ2 విభాగంలో అర్షద్‌ రజతం గెలిచాడు. మహిళల్లో జ్యోతి (మహారాష్ట్ర) గోల్డ్ మెడల్ అందుకుంది. దీంతో ర్యాంకింగ్స్‌లో వారు ముందుకెళ్లి పారాలింపిక్స్‌కు అర్హత సాధించారు. పారాలింపిక్స్‌ చరిత్రలోనే పారా సైక్లింగ్‌లో భారత అథ్లెట్లు పాల్గొనడం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement