మంగళగిరి, విశాఖపట్నం అంతర్జాతీయ స్టేడియాలుగా అభివృద్ధి
కొత్తగా మూడు అకాడమీల ఏర్పాటు
ప్రముఖ ప్లేయర్స్‌తో శిక్షణ
రూరల్ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం
పాఠశాలల్లో క్రీడా మైదానాలకు మరమ్మతులు
రెండేళ్ల ల్లో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగేలా ప్రణాళికలు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సమాయత్తం
ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ విశేష కృషి
(ఆంధ్రప్రభ స్మార్ట్ , ఎన్టీఆర్ బ్యూరో) ఏపీని క్రీడాంధ్రగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ యువతలోని నైపుణ్యాలను వెలికి తీసి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటోంది. మండల ప్రాంతాల్లో సైతం క్రీడా మైదానాలు అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారులుగా రాణించే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా ఏపీలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెటర్లకు తర్ఫీదు ఇవ్వటానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
విశాఖ అంతర్జాతీయ స్టేడియానికి నూతన సొబగులు
విశాఖపట్నంలోని అంతర్జాతీయ స్టేడియం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్టేడియంలో పాత గ్యాలరీలో స్థానంలో కొత్త గ్యాలరీల ఏర్పాటు సహా విద్యుత్ దీపాల మార్పు, పిచ్‌లకు ఆధునిక సొబగులు అద్ది దేశంలోని పెద్ద స్టేడియాలకు దీటుగా తయారుచేసేందుకు ఏసీఏ చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో విశాఖ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్‌లు రెగ్యులర్‌గా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
…
రెండేళ్లల్లో మంగళగిరి స్టేడియం రెడీ
ఆధునిక వసతులతో సువిశాల ప్రాంతంలో నిర్మించిన మంగళగిరి స్టేడియం ఐదేళ్ల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. స్టేడియంను అభివృద్ది చేయాలో లేదా నూతనంగా నిర్మించాలా అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎటువంటి మ్యాచ్‌లు నిర్వహించకపోవడంతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన స్టేడియం ప్రజలకు అక్కరకు రాకుండా పోయింది. నవ్యాంధ్ర రాజధానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో క్రీడలకు ఉపయోగ పడడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వం స్టేడియాన్ని అభివృద్ధికి చేసే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రానున్న రెండేళ్లల్లో ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు నిర్వహించే దిశగా కార్యాచరణ చేపడుతోంది.
…
త్వరలో మూడు అకాడమీలు ఏర్పాటు …
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ఎంపిక కావడంతో అకాడమీలో నూతనుత్తేజం వచ్చింది. రాష్ట్రంలో క్రికెటర్లను తయారు చేసేందుకు ప్రత్యేకంగా అకాడమీలను ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరంలో జూనియర్ బాలుర కోసం అకాడమీ, మహిళల కోసం అనంతపురంలో మరో అకాడమీ, సీనియర్స్ కోసం విజయవాడలో ఇంకొకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు అకాడమీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్న క్రీడాకారులతో యువతకు శిక్షణ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబిన్ సింగ్, మిథేలీ రాజ్ వంటి ప్రముఖులను కూడా అకాడమీలకు తీసుకు వచ్చి వారితో క్రికెట్‌లో మెళకువలను నేర్పించాలని యోచిస్తున్నారు. మూడు అకాడమీల ద్వారా వందలాది మంది క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.
…
రూరల్ క్రికెట్‌కు పెద్దపీట
…
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు క్రీడలపై ఆసక్తి పెంచేందుకు క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తోంది. రూరల్ క్రికెట్ పేరుతో పలు గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో గ్రౌండ్స్‌లో క్రికెట్ శిబిరాలు నిర్వహించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, గంగాధర నెల్లూరు ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
…
రెండేళ్లలో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ..
రానున్న రెండేళ్లల్లో రాష్ట్రంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నాం. అందుకనుగుణంగా విశాఖపట్నం, మంగళగిరి, మూల పాడు స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నాం. ఐపీఎల్ మ్యాచ్లకు ఐదుగురు ఆంధ్ర క్రికెటర్స్ ను కొత్తగా ఎంపిక చేయించుకోగలిగాం. ఆల్ రౌండర్‌గా నితీష్ రెడ్డి చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. వచ్చే ఐపీఎల్ లోపు 20 నుంచి 25 మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో సెలక్ట్ అయ్యేరీతిగా శిక్షణ ఇస్తున్నాం. – కేశినేని శివనాథ్ – అధ్యక్షుడు – ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్